- కాంగ్రెస్ గూటికి మున్సిపల్ చైర్మన్లు
- అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారుతున్న సీన్
- ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లోకి వలస
- తగ్గుతున్న బీఆర్ఎస్ బలం
- పార్లమెంటు ఎన్నికల వేళ మారుతున్న రాజకీయ సమీకరణాలు
- భవిష్యత్‌లో కలిసి వచ్చేనా..? చేటు తెచ్చేనా?
CONGRESS FOCUS ON MUNCIPALITYS: అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన కాంగ్రెస్.. క్షేత్రస్థాయిలోనూ తన పట్టును మరింత పటిష్టం చేసుకునేలా ప్లాన్ చేస్తున్నది. రాష్ట్రంలోని జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లతో పాటు మున్సిపల్ కౌన్సిల్, కార్పొరేషన్లపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో రోజుకొకరు ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలోకి వలస వెళ్తున్నారు. దీంతో ఇన్నాళ్లు గులాబీ పార్టీలో ఇమిడిన చైర్మన్లు నేడు ఆ పార్టీని వీడుతున్నారు. భవిష్యత్ అవసరాల కోసం అధికార పార్టీలో చేరుతుండగా, అది వారికి కలిసి వస్తుందో? చేటు చేస్తుందో కాలమే నిర్ణయిస్తుంది.
తిరుగులేని శక్తి నుంచి.. తిరోగమనంలోకి..
ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్‌కు కొందరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ (టీఆర్ఎస్)కు మొదటి ఎన్నికల్లోనే ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఏకంగా పదేళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఏ ఎన్నిక వచ్చినా కారు జోరు చూపింది. ప్రతిపక్షాల ఊహకు అందని విధంగా ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చింది. కానీ సీఎంగా కేసీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు బీఆర్ఎస్‌ను పతనం వైపు నడిపించాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేవలం 38 స్థానాలకే పరిమితమై అధికారం కోల్పోయింది. దీంతో ఆ పార్టీలో ఇన్నాళ్లు వివిధ హోదాల్లో పదవులు అనుభవించిన నేతలు.. ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు.
మున్సిపాలిటీలు ‘హస్త’గతం..
రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలున్నాయి. ఇందులో 112 మంది మున్సిపల్ చైర్మన్లు బీఆర్ఎస్ వారే ఉన్నారు. మిగిలిన 8 మున్సిపాలిటీల్లో నలుగురు కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ, మరో ఇద్దరు ఎంఐఎంకు చెందిన చైర్మన్లు ఉన్నారు. కాగా, రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అన్ని ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో ప్రతిపక్షాలు లేకుండా చేసింది. దీంతో ఎక్కడికెళ్లినా గులాబీ పార్టీ నేతల హవా కొనసాగింది. కొన్ని కార్పొరేషన్లలో తమకు సరైన బలం లేకున్నా ఇతర పార్టీల మద్దతుతో చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంది. అలాంటి పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేడర్ అధికార పార్టీలోకి జంప్ అవుతున్నది. ఇప్పటికే పలువురు మున్సిపల్ చైర్మన్లు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఒక్కొక్కరు కాంగ్రెస్ గూటికి
అధికార మార్పిడి తర్వాత రాష్ట్రంలోని మున్సిపల్ చైర్మన్లు హస్తం గూటికి చేరుతున్నారు. కొందరు స్వచ్ఛందంగానే పార్టీ మారగా, మరికొందరిపై అవిశ్వాసం పెట్టి మరీ అధికార పార్టీలోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, నిజామాబాద్ మేయర్ పీఠాలను ఎంఐఎం సపోర్టుతో గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. మిగతా వాటిలో సొంతంగా బలంతోనే చైర్మన్ గిరిని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో అధికారం కోల్పోగానే ఆ పార్టీ చైర్మన్లు, కౌన్సిలర్లు అధికార పార్టీలోకి వలస పోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, తిరుమల గిరి చైర్ పర్సన్ శాగంటి అనసూయ రాములు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి, గద్వాల చైర్మన్ బీఎస్ కేశవ్, డోర్నకల్ చైర్మన్ వీరన్నతో పాటు పలువురు చైర్మన్లు సీఎం, మంత్రుల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది హస్తం గూటికి చేరితే ఆ పార్టీ బలం మరింత పెరుగనున్నది. ఒకప్పుడు రెండే ముస్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అన్ని మున్సిపాలిటీలపై జెండా ఎగురవేయాలని పావులు కదుపుతున్నది.
భవిష్యత్‌లో కలిసి వచ్చేనా? చేటు చేసేనా?
అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వారే స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తారు. కాగా, మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలం మరో ఆరు నెలల్లో ముగియనున్నది. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. కొందరు ఇప్పటికే వెళ్లిపోగా, మరికొందరు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి పోటీ చేసి మున్సిపల్‌లో కీలక పదవులు దక్కించుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి చేరిక వీరిక భవిష్యత్‌లో కలిసి వస్తుందా? లేక చేటు చేస్తుందా? అనేది కాలమే నిర్ణయించాలి. చూద్దాం.. ఏం జరుగుతుందో!