- నామ్ కే వాస్తేగా ఇంటర్వూలు
- పైసలిచ్చినోళ్లకే ఉద్యోగాలట!
- ఓ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాకం
Jobs for sale: జగిత్యాల, అక్టోబర్ 14 (మన బలగం): ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల కోసం ప్రకటన ఇచ్చిన ఓ ఏజెన్సీ నిర్వాహకులు వెయ్యి మందికి పైగా నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు తీసుకొని కేవలం డబ్బులు చెల్లించిన కొందరికే నామమాత్రం ఇంటర్వ్యూలు నిర్వహించి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన సంఘటన ఇది. జగిత్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో వంటమనిషి, చాకలి, మంగలి, అటెండర్లతోపాటు మరికొన్ని విభాగాల్లో 30కి పైగా ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించనున్నట్లు గత నెల ఓ ఏజెన్సీ నిర్వాహకులు ప్రకటన జారీ చేశారు. దీంతో రిజిస్ర్టార్ కార్యాలయ సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆఫీసులో నిరుద్యోగుల నుంచి దాదాపు 14 వందలకు పైగానే దరఖాస్తులను తీసుకున్నట్లు సమాచారం.
ఒక్కో ఉద్యోగానికి లక్ష్యకు పైగానే వసూలు?
ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల కల్పన పేరిట పత్రికా ప్రకటన ఇచ్చిన ఓ ఏజెన్సీ నిర్వాహకులు దాదాపు 14వందలకు పైగానే దరఖాస్తులు నిరుద్యోగుల నుంచి తీసుకొని ఇటీవలే తహసీల్దార్ చౌరస్తాకు సమీపంలోని ఓ హోటల్‌లో డబ్బులు ఇచ్చినోళ్లకే ముందు రోజు సమాచారం ఇచ్చి మరుసటి రోజు నామ్ కే వాస్తేగా ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిసింది.
సిఫారసు లేఖలకు కొన్ని పోస్టులు
అధికార పార్టీ రాజకీయ నాయకుల సిఫారసు లేఖలకు ఓ పదికి పైగానే ఔట్ సోర్సింగ్ పోస్టులను ఆ ఏజెన్సీ నిర్వాహకులు కేటాయించినట్లు తెలిసింది. ఇవిపోగా మిగతావి రేటుకట్టి ఏజెన్సీ నిర్వాహకులు విక్రయించినట్లు ప్రచారంలో ఉంది. ఈ ప్రకారంగా లక్షల్లోనే వెనకేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
నేటి పోటీ ప్రపంచంలో ఏ చిన్న ఉద్యోగం దొరికినా చాలు అనే ఆశతో పెద్ద సదువులు చదివినోళ్లు కూడా అటెండర్, తమ కుల వృత్తుల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఇందులోనూ ఈ ఉద్యోగాల కోసం అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల పైరవీలు సాగినట్లు తెలిసింది. ప్రజా ప్రతినిధుల కోటా పోగా మిగిలిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లోనూ ఆ ఏజెన్సీ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల పేరిట, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని పైసలిచ్చినోళ్లకే పోస్టింగ్‌లు కేటాయిస్తూ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారన్న విమర్శలు జగిత్యాలలో సర్వత్రా వినిపిస్తున్నాయి. నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్ స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని పలువురు విద్యావంతులు కోరుతున్నారు.