Selling liquor at high prices: బుగ్గారం, అక్టోబర్ 29 (మన బలగం): జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్‌లోని శ్రీ లక్ష్మీ నరసింహ వైన్స్‌లో జరుగుతున్న దోపిడీకి అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారని తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు, బుగ్గారం మండల అభివృద్ధి కమిటీ కన్వీనర్ చుక్క గంగారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. కానీ ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంతో మంగళవారం సైతం గోపులాపూర్ వైన్స్‌లో యథావిధిగా అధిక ధరలకు మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నారని చుక్క గంగారెడ్డి ఆరోపించారు. ఎక్సైజ్ అధికారి రాజమౌళి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లు తెలిపారు.