Jagityal MLA Sanjay Kumar: జగిత్యాల ప్రతినిధి, జనవరి 24 (మన బలగం): ఎన్నికల వరకే రాజకీయాలు నడుస్తాయని, అనంతరం అభివృద్ధి నిరంతర ప్రక్రియగా మారుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం జగిత్యాల పట్టణ టౌన్ హాల్‌లో జగిత్యాల పురపాలక సంఘం కౌన్సిల్ సభ్యుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో గౌరవ కౌన్సిలర్ సభ్యులకు నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పురపాలక కౌన్సిల్ సమయంలో అనేక ముఖ్య కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేసుకున్నామన్నారు. డబల్ బెడ్ రూం ఇండ్లు, నర్సింగ్ కళాశాల, మెడికల్ కళాశాల, రైతు బజార్, పార్కులు, శ్మశాన వాటికలు, డివైడర్‌లు, రహదారులు, సెంట్రల్ లైట్, మినీ ట్యాంక్ బండ్, పట్టణంలో నలువైపులా జోన్ల మార్పు, 1000 మీటర్లలో యావర్ రోడ్డు విస్తరణ, డంపింగ్ యార్డు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి మద్దతుతో పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ని కలిసి పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ఒక్కో వార్డులో దాదాపు 1 నుంచి 2 కోట్ల పైగా పనులకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. జగిత్యాల పట్టణంలో కౌన్సిల్ పదవి ముగిసిన తరువాత వార్డు ఆఫీసర్ పాత్ర చాలా కీలకమవుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు పదవి కాలం ముగిసినా ప్రజా సేవ అనేది శాశ్వతంగా నిరంతరంగా కొనసాగాలని కోరారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రతినిధులు, అధికారులు పని చేయాలని కోరారు. పట్టణ మాస్టర్ ప్లాన్, లే ఔట్‌లకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని, ఆ దిశగా అధికారులు పనిచేయాలని కోరారు. అర్హులైన అందరికీ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించే విధంగా నాయకులు చొరవ తీసుకోవాలి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.