- హైడ్రా పేరుతో డ్రామాలాడుతున్నరు
- మూసీ ప్రక్షాళన పేర పేదల ఇండ్లు కూలగొడుతున్నరు
- కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్
- ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహా ధర్నా
- పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్సీ నేత మహేశ్వర్ రెడ్డి
BJP Maha Dharna: మన బలగం, తెలంగాణ బ్యూరో: మూసీ బాధితులకు అండగా బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతోపాటు ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో హైడ్రా తీసుకొచ్చి పేదలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి, లక్షల మంది కుటుంబాలకు అన్యాయం చేయొద్దని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. తాము బస్తీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మూసీ బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారని తెలిపారు. 70, 80 ఏండ్ల క్రితమే తెలంగాణ పల్లెల నుంచి ఉపాధి కోసం వేలాది కుటుంబాలు హైదరాబాద్‌కు వచ్చాయని చెప్పారు. గుడిసెలు వేసుకుని బతుకుతున్న వారికి 40 ఏండ్ల క్రితమే ప్రభుత్వం ఇండ్ల పట్టాలిచ్చిందని వెల్లడించారు.
మూసీ పరివాహక ప్రాంతంలో బఫర్ జోన్లో కట్టుకున్న ఇండ్లంటూ రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. పేద ప్రజలు ఎక్కడ కూడా అక్రమంగా ఆక్రమించుకోలేదని, పట్టా భూములను కొనుక్కున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టా భూములు, కొనుక్కుని కట్టుకున్న ఇండ్లను కూలగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇండ్లలో సామాన్లు తీసుకునేందుకు కూడా గంటపాటు కూడా సమయం ఇవ్వకుండా ఇండ్లు కూలగొట్టడం దారుణమన్నారు. మూసీ ప్రక్షాళనకు.. ఇండ్ల కూల్చివేతలకు ఏం సంబంధమో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే.. కాని, పేదల ఇండ్లు కూల్చడం సరికాదన్నారు. పట్టాభూముల్లో లేని ఇండ్లను పేదలు తామే కూలగొట్టుకుంటామంటున్నారు. మరి, ఒకవేళ పట్టాభూములు కాదని నిరూపించకపోతే రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాయాలని సవాల్ చేశారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పంట పొలాలకు విషం చిమ్మే నీటి శుద్ధి జరిగి.. పంటలు బాగా పండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
బీజేపీ అండతో, మూసీ బాధితుల ఉసురుతగిలి హైడ్రా తోకముడుస్తోందన్నారు. డీపీఆర్‌కు రూ.140 కోట్లు ఖర్చవుతుందని రేవంత్ రెడ్డి చెబుతున్నాడని తెలిపారు. పూటకో మాట చెబుతూ మోసం చేయగలిగే నైపుణ్యం కలిగిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. పేదల ఇండ్లకు ఆర్బీ ఎక్స్ అని రాస్తూ కూలగొడుతున్నారని, దొంగల్లా ప్రతి ఇంటికి రంగు వేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తోందంటూ కొంతమందితో డబ్బులు ఇచ్చి ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి.. మీకు దమ్ముంటే లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారో..? ఎన్ని సంవత్సరాల్లో మూసీ ప్రక్షాళన పూర్తిచేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి పదివేల కోట్లు అప్పు తెచ్చే సామర్థ్యం లేనప్పుడు లక్షన్నర కోట్ల అప్పు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పేదల కడుపుకొడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను ఎప్పటిలోగా పూర్తిచేస్తారు.. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమండ్ చేశారు. పేదల ఇండ్లను రక్షించుకునేలా ప్రజలకు అండగా తాముంటామన్నారు.