CPI Karimnagar: కరీంనగర్, జనవరి 22 (మన బలగం): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పూర్తిగా అక్రమాలు, అవకతవకలు జరిగాయని సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు తీవ్రంగా ఆరోపించారు. కరీంనగర్ నగరంలో ఇండ్ల కోసం సర్వే చేసిన అధికారులు పూర్తిగా అర్హులను కాకుండా వారికి ఇష్టం వచ్చిన వారిని ఎంపిక చేయడం ఏంటని ప్రశ్నించారు. బహుళ అంతస్తులు ఉన్న వారిని ఈ లబ్ధిదారుల లిస్టులో పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తూతూ మంత్రంగా ఎంక్వయిరీ చేసారని మండిపడ్డారు. ప్రజా పాలన కార్యక్రమం జరిగే ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు అర్హుల లిస్టు అని గోడలకు అతికేసి చేతులు దులుపుకున్నారని, మళ్లీ రీ సర్వే చేస్తే 20% మంది కూడా అర్హులు ఉండరని, ఇది ప్రభుత్వాన్ని, ప్రజలను అధికారులు తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. ఒక్కో డివిజన్‌లో 100 నుంచి 500 వరకు అర్హుల లిస్టును చూస్తే అధికారుల పనితనం మనకు కనబడుతుందని అన్నారు. కరీంనగర్ నగరంలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తిగా అసబద్దంగా ఉందని, సరైన జవాబుదారితనం అధికారుల వద్ద లేదని మండిపడ్డారు. సర్వేలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా చేశారో అధికారులు చెప్పాలని వారు కోరారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఆర్థికంగా బహుళ అంతస్తులు ఉన్న వారిని గతంలో ఇందిరమ్మ ఇండ్లు పొందిన వారిని ఇందులో చేర్చడం చూస్తుంటే అక్రమాలు జరిగాయనేది స్పష్టంగా కనబడుతుంది అన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఈ అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలని, లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో పేదలతో ఆందోళన చేస్తామని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు హెచ్చరించారు.