మహాలక్ష్మి అవతారంలో దుర్గమ్మ
Durga Mata decoration with currency notes Lokeshwaram: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లోకేశ్వరం మండలంలోని ధర్మోరా గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గమ్మకు గ్రామస్తులు ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రోజుకో రూపంలో అమ్మవారిని అలంకరిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారిని ఐదవ రోజు మహాలక్ష్మి రూపంలో అలంకరించాలని నిర్వాహకులు, దుర్గామాత కమిటీ సభ్యులు నిర్ణయించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భారీ మొత్తంలో కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈసారి కూడా గ్రామంలోని దుర్గామాత కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని రూ.11 లక్షల విలువైన 200, 500 వందల రూపాయల నోట్లతో శుక్రవారం సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గ్రామంలోని మహిళలు మంగళ హారతులతో తరలివచ్చి దుర్గమ్మకు తొమ్మిది రోజులపాటు భక్తినిష్ఠలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ఇక కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి అవతారంలో కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు చుట్టుపక్కల ఉన్న వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు.