blood donation camp: నిర్మల్, అక్టోబర్ 5 (మన బలగం): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్మల్ పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్మల్ సబ్ డివిజన్ పోలీస్ వారు పట్టణ ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ క్యాంప్‌ను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాలను వెలకట్టలేమని అన్నారు. అమరుల త్యాగ ఫలంగానే ఈరోజు దేశం, రాష్ట్ర ప్రజలందరూ శాంతియుతంగా, ప్రశాంతంగా ఉన్నారన్నారు. రక్త దానం చేయడం అనేది ఒక సామాజిక సేవా కార్యక్రమం అని, క్లిష్ట పరిస్థితుల్లో, ఆపద సమయంలో ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి వారిపాలిట దేవుళ్లుగా మారతారు అన్నారు.
తలసేమియా, క్యాన్సర్, మెడికల్ ఎమర్జెన్సీ పేషంట్లు, బ్లడ్ కేన్సర్ రోగులు, హిమోఫీలియా, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, తదితర జబ్బులతో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి సామాజిక సేవలో పాల్గొని తోటి వారి ప్రాణాలను కాపాడడంలో తమవంతు సహాయంగా రక్త దానం చేయడం అనేది ఒక సామాజిక సేవా కార్యక్రమం అని తెలిపారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి మనిషి 6 నెలలకొకసారి రక్తదానం చేయాలని సూచించారు. కార్యక్రమం ఏర్పాటు చేసిన డీఎస్పీ గంగా రెడ్డి టీమ్‌ను ప్రశంసించారు. అనంతరం రక్తదానం చెసిన వారికి పండ్లు, పానీయాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ గంగా రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, రామ కృష్ణ, నవీన్ కుమార్, ఆర్ఐలు రామ్ నిరంజన్ రావు, శేఖర్, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, పోలీస్ సిబంది, రక్త దాతలు పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో 120 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.