Lok Sabha Counting Karimnagar: కరీంనగర్ లోక్‌సభ స్థానానికి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటు స్థానం పరిధిలో కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాద్, మానకొండూర్, హుజురాబాద్, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత నెల 13 తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. లోక్‌సభ పరిధిలో 17,97,150 మంది ఓటర్లు ఉండగా, 13,03,690 మంది ఓలు వేశారు. 72.54 శాతం పోలింగ్ నమోదైంది. వృద్ధులు, దివ్యాంగులు 1625 మంది ఉండగా 1560 మంది ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కొనసాగుతున్న కౌంటింగ్
కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో అధికారులు ఉదయమే కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. స్ర్టాంగ్ రూమ్‌కు వేసిన సీల్‌ను సిబ్బంది తొలగించారు. 6 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ షురూ అయ్యింది. 8.30 గంటలకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు విడివిడిగా ఓట్లు లెక్కిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 395 పోలింగ్ స్టేషన్లు ఉండగా 18 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. చొప్పందండిలోని 327 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు, 24 రౌండ్లు కౌంటింగ్ నిర్వహించనున్నారు. వేములవాడలోని 260 పోలింగ్ స్టేషన్లకు గాను 14 టేబుల్స్, 19 రౌండ్లు ఓట్లు లెక్కిస్తున్నారు. సిరిసిల్లలో 287 పోలింగ్ స్టేషన్లకు 14 టేబుల్స్ 21 రౌండ్లు, మానకొండూర్ 316 పోలింగ్ స్టేషన్లకు 14 టేబుల్స్ 231 రౌండ్లు, హుజూరాబాద్ 305 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుల్స్ 22 రౌండ్లలో కౌంటింగ్ కొనసాగుతోంది.
రౌండ్ల వారీగా లీడ్ ఇలా..
పోలింగ్ సమయంలో త్రిముఖ పోటీలా అనిపించినా లెక్కింపులో మాత్రం వార్ వన్‌సైడ్ అని తేలిపోయింది. ఆది నుంచి బీజేపీ అభ్యర్థి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి, మూడో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొనసాగుతున్నారు. మొదటి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కి 28,184 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్‌పల్లి వినోద్‌కు 14,216, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు 15,716 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్‌లో బండి సంజయ్‌కి 28,184, బోయిన్‌పల్లి వినోద్‌కు 14,216, రాజేందర్ రావుకు 15,716 ఓట్లు వచ్చాయి.
రెండు రౌండ్లలో కలిపి సంజయ్‌కి 57,773, వినోద్‌కు 26,772, రాజేందర్ రావుకు 31,565 ఓట్లు వచ్చాయి.
మొదటి రౌండ్‌లో సంజయ్‌కి 12,468 ఓట్ల లీడ్ రాగా రెండో రౌండ్ ముగిసే సరికి 26,208 ఓట్ల లీడ్‌తో ముందంజ కొనసాగుతున్నారు.
ఆరో రౌండ్‌లో బండి సంజయ్ 1,70,383 ఓట్లు, వినోద్ 79,520, రాజేందర్ 93946 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండ్ ముగిసే సరికి బండి సంజయ్ 93,946 ఓట్ల మెజార్టీతో లీడ్‌లో ఉన్నారు.