T20 World Cup SL vs SA: టీ 20 వరల్డ్ కప్(T20 World Cup)లో భాగంగా న్యూయార్క్(New York)లోని నసవు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Nassau International Cricket Stadium)లో జరిగిన నాలుగో మ్యాచ్‌లో శ్రీలంక(Sri Lanka)ను దక్షిణాఫ్రికా (South Africa) చిత్తు చిత్తుగా ఓడించింది. మొదట టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ తీసుకుని తప్పు చేసింది. పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. సౌతాఫ్రికా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో శ్రీలంక బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు. శ్రీలంక కేవలం 77 పరుగులకే ఔట్ అయి పరువు పోగొట్టుకుంది. శ్రీలంక బ్యాటర్లలో ఎవరూ కూడా 20 పరుగులు కూడా చేయకపోవడం గమనార్హం.. అందులో లంక బ్యాట్స్‌మెన్స్ నలుగురు డకౌట్ కాగా.. మరో నలుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
శ్రీలంక బ్యాటర్లలో కుషాల్ మెండిస్ 19 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. సీనియర్ ప్లేయర్ ఎంజెలో మ్యాథ్యూస్ 16 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో అండ్రీ నోకియా నాలుగు ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టగా.. రబాడ, కేశవ్ మహారాజ్ చెరో రెండు వికెట్లు నేలకూల్చారు. దీంతో పాటు రెండు ఓవర్లు మెయిడిన్ చేయడం విశేషం. డెబ్యూ బౌలర్ బార్ట్ మెన్ నాలుగు ఓవర్లు వేసి కేవలం 9 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. దీంతో శ్రీలంక 77 పరుగులకే ఆలౌట్ అయింది.
కఠినమైన ఈ పిచ్‌పై దక్షిణాఫ్రికా బ్యాటర్లు కూడా రన్స్ చేయడానికి శ్రమించాల్సి వచ్చింది. 78 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి.. 16.2 ఓవర్లలో ఛేజింగ్ చేశారంటే పిచ్ ఎంత బౌలింగ్‌కు అనుకూలించిందో అర్థం చేసుకోవచ్చు. క్వింటన్ డికాక్ 20 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ సిక్సు, ఫోర్ సాయంతో 19 పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు విజయం అందించాడు. ఈ మ్యాచులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించి రెండు పాయింట్లు ఖాతాలో వేసుకోగా.. శ్రీలం మైనస్ పాయింట్లలో గ్రూపులో చివరి స్థానానికి పడిపోయింది. సౌతాఫ్రికా బౌలర్లు రెండు మెయిడిన్స్, శ్రీలంక బౌలర్లు ఒక మెయిడిన్ ఓవర్ వేయడంతో టీ 20 మ్యాచ్‌లో మూడు మెయిడిన్లు అయిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.