- మా ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం
- రైతును రాజు చేయాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం
- ప్రభుత్వ మద్దతు ధరకు చివరి గింజ వరకు ధాన్యాన్ని కొంటాం
- సన్నరకం వడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్
- మామిడిపెల్లి, నిజామాబాద్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Government Whip Adi Srinivas: మనబలగం, కరీంనగర్ బ్యూరో:కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతును రాజు చేయాలన్నదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పమని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపెల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, నిజామాబాద్ గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ దళారీ వ్యవస్థకు స్వస్తి పలికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కొనుగోలు కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పజెప్పినట్లు గుర్తు చేశారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఉచిత విద్యుత్ పంపిణీ ఫైల్ పై తొలి సంతకం చేసారన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొనుగోళ్ళు ఆలస్యమయ్యాయని, దీని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ప్రస్తుతం సమయానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని, క్షేత్ర స్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రైతులకు మేలు కలిగే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేపడుతామన్నారు. రైతు భరోసా త్వరలోనే ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారని గుర్తు చేశారు. రుణమాఫీలో భాగంగా సుమారు 18 వేల కోట్ల రూపాయలను 22 లక్షల మంది ఖాతాల్లోకి జమ చేశామని తెలిపారు. సాంకేతిక సమస్య వల్ల కొందరు రైతుల ఖాతాల్లో జమ కాలేదని, అవి జమ చేయడానికి వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రేషన్ కార్డులు లేని వారిని గుర్తించి వారికి 31 వేల కోట్ల రుణమాఫీ వర్తింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రస్తావించారు.
రైతుల సంక్షేమం కోసం ఆనాడు రాజశేఖర్ రెడ్డి అహర్నిశలు శ్రమించేవాడని, అదే స్పూర్తితో ప్రస్తుతం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో పెట్టిన 9 ప్రాజెక్టుల్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉందని, మన ప్రాంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మరింత సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. మల్కపేట రిజర్వాయర్ లో నీటిని నింపి కోనరావుపేట మండలంలోని సుమారు 7 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందిని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ధాన్యం అమ్మిన తర్వాత రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేశారు. అదనవు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఎక్కడో అమ్ముకోకుండా రైతు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రైతులు దళారులను మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలు చేశాక 48 గంటల్లో రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా పరిధిలో 258 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు సరిపడా గన్ని సంచులు తూకం వేశాక లారీల కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. సంబంధిత ప్రభుత్వ అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటారని, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే వారి దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. రైతుల సౌకర్యార్థం ప్రతీ కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్ కవర్లు, ప్యాడీ క్లీనింగ్ మెషీన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఓ శేషాద్రి,అధికారులు, ఫ్యాక్స్ చైర్మన్ నర్సయ్య, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.