- ఈ సారి పట్టుబడింది ల్యాండ్ సర్వే ఉద్యోగులు
- ఈ నెలలో ఇది రెండో దాడి
- 13న పట్టుబడిన నిర్మల్ మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్
- వరుస దాడులు జరుగుతున్నా మారని అధికారుల తీరు
ACB Raid: నిర్మల్, నవంబర్ 29 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో ఉన్న ల్యాండ్ అండ్ సర్వే కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జూనియర్ అసిస్టెంట్ జగదీశ్, అటెండర్ ప్రశాంత్ పట్టుబడ్డారు. నిర్మల్ పట్టణంలోని బుధవార్‌పేటకు చెందిన సల్ల హరీశ్ తమ భూమికి సంబంధించి సేత్వార్ కోసం కార్యాలయానికి వచ్చాడు. అయితే సేత్వార్ ఇచ్చేందుకు జూనియర్ అసిస్టెంట్ జగదీశ్ రూ.10 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో రూ.10 వేలు జగదీశ్, అటెండర్ ప్రశాంత్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ నెలలో రెండో ఘటన
నిర్మల్ జిల్లాలో ఏసీబీ రెయిడ్ జరగడం ఈ నెలలో ఇది రెండో సారి. ఈ నెల 13న నిర్మల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ షాకీర్ ఖాన్ అదే కార్యాలయంలోని ఉద్యోగి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డాడు.
గతంలో అనేకం
గతంలో మున్సిపల్ మేనేజర్‌గా పనిచేసిన గంగాధర్ ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు. అంతకుముందు కార్మిక శాఖ అధికారిగా పనిచేస్తున్న సాయిబాబా, తన కుమారుడితో సహా ఏసీబీ దాడుల్లో దొరికారు. అంతకుముందు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, తాత్కాలిక ఉద్యోగి పట్టుబడ్డారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా లంచావతారుల తీరు మారడం లేదు. సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయంలోనే ఉన్న ఈ ఉద్యోగి లంచం డిమాండ్ చేయడం, ఏసీబీకి పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది.