- దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేత
- రెండు రోజులుగా ఆందోళనలు ఉధృతం
- భైంసా-నిర్మల్ రహదారి దిగ్బంధం
- పురుగుమందు డబ్బాలతో మహిళల బైఠాయింపు
- ఆరు గంటలపాటు ఆర్డీవో నిర్బంధం
- సురక్షితంగా తీసుకెళ్లిన పోలీసులు
- పలువురు నిరసనకారుల అరెస్టు
- పోలీసు వాహనాల అడ్డగింత
- దిలావర్‌పూర్ పోలీసు స్టేషన్ ఎదుట నిరసన
- పరిస్థితిపై ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక
- ఫ్యాక్టరీ పనులు నిలిపివేస్తూ ఉత్తర్వులు
- స్టడీ చేసి నిర్ణయం తీసుకుంటామన్న డిప్యూటీ సీఎం
- ఫ్యాక్టరీ పూర్తిగా తొలగించే వరకు ఆందోళనలు: జేఏసీ
Dilawarpur Ethanol Factory: నిర్మల్, నవంబర్ 27 (మన బలగం): నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్-గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జేఏసీ తలపెట్టిన పోరాటం ఫలించింది. ఐదు గ్రామాల ప్రజలు, రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలతో ప్రభుత్వం దిగివచ్చింది. రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఆందోళనలు ఉధృతరూపు దాల్చడంతో ప్రభుత్వం, అధికారులు ప్రకటన చేశారు. ఫ్యాక్టరీపై స్టడీ చేసి రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్లడించారు. ఫ్యాక్టరీ పనులు నిలిపివేస్తూ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. పుకార్లు నమ్మొద్దని, ప్రజలు శాంతించాలని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల కోరారు.
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ రెండు రోజులుగా రణరంగంగా మారింది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తలపెట్టిన నిరసన ఉధృతరూపం దాల్చింది. రెండో రోజు బుధవారం సైతం ఆందోళన కొనసాగింది. దిలావర్‌పూర్, గుండంపల్లి, సముందర్‌పల్లి, రత్నపూర్‌కాండ్లి, చర్లపల్లి గ్రామాల ప్రజలు నిరసనలో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు టెన్షన వాతావరణం నెలకొంది. భైంసా – నిర్మల్ రహదారిని పూర్తిగా దిగ్బంధించారు. గ్రామస్తులతో మాట్లాడేందుకు వచ్చిన నిర్మల్ ఆర్డీవో రత్నకల్యాణిని దాదాపు ఆరు గంటల పాటు కారులోనే నిర్బంధించారు. పోలీసులు ఎట్టకేలకు ఆర్డీవోను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు ఆర్డీవో వాహనంపై దాడి చేశారు. అంతకుముందు గ్రామస్తులు, మహిళలు పెద్దసంఖ్యలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇథనాల్ ఫ్యాక్టరీని తొలగించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కొందరు మహిళలు పురుగుమందు డబ్బాలు చేతబట్టుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. భూములు సేకరించే సమయంలో వడ్ల ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారని, తీరా భూములు ఇచ్చాక ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించలేదని, అందుకే ఆందోళన ఉధృతం చేస్తున్నామని స్పష్టం చేశారు. భైంసా- నిర్మల్ జాతీయ రహదారిపై మంగళవారం నుంచి నిరసనను కొనసాగిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. రహదారిపైనే వంటలు చేసుకొని భోజనాలు చేశారు. అధికారులు నచ్చ చెప్పినప్పటికీ రైతులు శాంతించలేదు.
సీఎం పేషీకి ఇథనాల్ వివాదం
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం గుండంపెల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ ప్రజలు ఏడాదికాలంగా ఆందోళన చేస్తున్నారు. పలుమార్లు కలెక్టర్ కార్యాలయం ముందు తమ నిరసనను తెలిపి వినతి పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ అధికారులు, రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ రైతులకు సరైన సమాధానం రాకపోవడంతో వారు ఆందోళనలను విరమించలేదు. రెండు రోజులుగా ఆందోళనను ఉధృతం చేయడంతో నిర్మల్ జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.
దిలావర్‌పూర్‌లో ఉద్రిక్తత
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండల కేంద్రంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఒక దశలో పోలీసులకు ప్రజలకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల నేతృత్వంలో భారీగా పోలీసులను మోహరించి భద్రత ఏర్పాట్లు చేపట్టారు. రెండు రోజులుగా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిరసిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఉగ్రరూపం దాల్చడంతో పోలీసులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆందోళన చేపట్టిన రైతులను, ప్రజలను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ఉదయం నుంచి రైతులు, ప్రజలు దిలావర్‌పూర్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన పాత్రికేయులను సైతం పోలీసులు అరెస్టులు, అదుపు చేయడం కనిపించింది. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని, విడుదల చేసే వరకు ఆందోళన విరమించేది లేదని ప్రజలు తెగేసి కూర్చున్నారు. మహిళలు పురుగుమందు డబ్బాలు చేతబట్టి ఆందోళనకు దిగారు. అరెస్టు చేసిన వారిని నిర్మల్, సోన్, లోకేశ్వరం పోలీసు స్టేషన్లకు తరలించారు.
ఫ్యాక్టరీ పనలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు
ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేస్తూ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. ఐదు గ్రామాలకు చెందిన రైతులతో కలెక్టర్ చర్చలు జరిపారు. అనంతరం ఫ్యాక్టరీ పనులు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీపై ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు కలెక్టర్ తెలిపారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. కాగా రైతుల ఆందోళనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై స్టడీ చేసి నిర్ణయం తీసుకుంటామని, రైతులు ఆందోళన చెందొద్దని కోరారు.
పుకార్లు నమ్మొద్దు: ఎస్పీ
ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రజలు శాంతించాలని ఎస్పీ జానకి షర్మిల కోరారు. సమస్యను వివరిస్తూ కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారని, ఫ్యాక్టరీ పనులు సైతం నిలిపివేశారని తెలిపారు. ప్రజలు పుకార్లు నమ్మి శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని కోరారు. పుకార్లు వ్యాపించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా బుధవారం సాయంత్రం దిలావర్‌పూర్‌కు చేరుకున్న ఎస్పీకి గ్రామస్తులు స్వాగతం పలికి సంతోషం వ్యక్తం చేశారు. ఎస్పీకి మద్దతుగా నినాదాలు చేశారు. రెండు రోజులపాటు కొనసాగిన ఆందోళనలు సద్దుమణిగేలా కృషిచేసినందుకు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.
లిఖితపూర్వక హామీ ఇస్తే ఆందోళన విరమిస్తాం
ఇథనాల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిగా నిలిపి వేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని దిలావర్‌పూర్ మండల ప్రజలు తెగేసి చెబుతున్నారు. ప్రాజెక్టు పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం రావడంతో ఆ విషయాన్ని దిలావర్‌పూర్, గుండంపెల్లి గ్రామాల ప్రజలకు పోలీసులు, జిల్లా కలెక్టర్ తెలిపారు. తమకు రాతపూర్వక హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. తాము శాంతియుతంగా తమ నిరసనను కొనసాగిస్తూనే ఉంటామని, రాతపూర్వక హామీ ఇచ్చిన రోజే పూర్తిగా ఆందోళన విరమిస్తామని తెగేసి చెప్పారు.
రెవెన్యూ ఉద్యోగుల నిరసన
నిర్మల్ ఆర్డీవోపై దాడికి నిరసనగా జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు బుధవారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఇథనాల్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా దిలావర్‌పూర్‌లో చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని సందర్శించి విరమించాల్సిందిగా కోరేందుకు వెళ్లిన ఆర్డీవోను ఆరు గంటల పాటు తమ వాహనంలో నిర్బంధించారు. దీంతో ఆర్డీవో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. సుమారు 600 మంది పోలీసులు వాలయంగా ఏర్పడి ఆర్డీవో వాహనానికి రక్షణకవచంలా ఏర్పడ్డారు. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనకారులను చెదరగొట్టి ఆర్డీవో వాహనాన్ని అక్కడి నుంచి తరలించారు. అస్వస్థతకు గురైన ఆర్డీవోను ఆసుపత్రికి తరలించారు. దీంతో రెవెన్యూ ఉద్యోగులు తమ నిరసనను వ్యక్తం చేస్తూ విధులకు హాజరయ్యారు. దాడికి బాధ్యులైన వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బైంసా రెవెన్యూ డివిజనల్ అధికారి కోమల్ రెడ్డి డిమాండ్ చేశారు.