Farmers protest: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, జూన్ 27 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో శుక్రవారం 9వ ప్యాకేజీ బాధిత రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. 9వ ప్యాకేజీ పైపులైన్‌లో నష్టపోయిన భూమితో పాటు రైతులకు ఉన్న మొత్తం పట్టాలు గల్లంతు అయ్యాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పట్టాలు కోల్పోయిన రైతులకు పట్టాలు ఇవ్వాలని అలాగే ఈ పంటకు సంధించిన రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ అయేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 9వ ప్యాకేజీలో నష్టపోయిన భూమి మాత్రమే మీ పట్టాల నుంచి డిలీట్ అవుతుందని చెప్పిన అధికారులు రైతులకు ఉన్న మొత్తం భూమి వివరాలతో డెలిట్ కావడంతో పట్టా వివరాలు ఆన్‌లైన్ నుంచి కూడా పోవడంతో రైతులకు అన్యాయము చేశారని అన్నారు. వీర్నపల్లితో పాటు పలు గ్రామాల్లోనూ ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మండలం వివిధ గ్రామలలో నష్టపోయిన రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయానికి వెళ్తామని అన్నారు. సోమవారం చలో కలెక్టరెట్ ముట్టడికి 9వ ప్యాకేజీ బాధిత రైతులు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు ప్రకాష్, దర్శనల లింబాద్రి,అన్నారం జనార్దన్, లక్ష్మణ్, శేఖర్, మల్లారపు అరుణ్ కుమార్, పిట్ల నాగరాజు, రాజేశం ప్రవీణ్, దేవయ్య, నర్సయ్య, శంకర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.