- డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి
- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
Drug awareness rally: నిర్మల్, జూన్ 28 (మన బలగం): అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగ, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ అభిలాష అభినవ్ శివాజీ చౌక్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి ర్యాలీ ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు కొనసాగింది. మినీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో కలెక్టర్ మాట్లాడారు. సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను రక్షించుకోవాలన్నారు. వారికి సరైన దిశానిర్దేశం చేస్తే దేశాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దుతారని వెల్లడించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం సమాజాన్ని నాశనం చేస్తోందని, ప్రతి ఒక్కరూ వీటి నిర్మూలనకు సైనికుడిలా పాటుపడాలని కోరారు. మాదకద్రవ్యాల తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగం చట్టపరంగా నేరమని హెచ్చరించారు. దీనికి సంబంధించి ఎవరైనా 1908 హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం ఇవ్వొచ్చని సూచించారు.
గత వారం రోజులుగా ‘నషా ముక్త భారత్’ కార్యక్రమం కింద జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. మాదకద్రవ్యాల రహిత నిర్మల్ జిల్లా సాధనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు. అందరి సూచనలు, సహకారాలు స్వాగతిస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డీ-అడిక్షన్ సెంటర్ ద్వారా బాధితులకు వైద్యసహాయం అందిస్తున్నట్టు వెల్లడించారు. విద్యార్థుల స్థాయిలోనే మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎంతో మంది యువకుల భవిష్యత్తును ఇవి నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో కలిసి కలెక్టర్ మాదకద్రవ్యాల వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత బృందాలు ప్రజల్లో మాదకద్రవ్యాలపై చైతన్యం కలిగించే ప్రదర్శనలు ఇచ్చారు. ప్రత్యేకంగా రూపొందించిన పాటల ద్వారా మాదకద్రవ్యాల హానిని చాటిచెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్, డీఈవో పి.రామారావు, ఎక్సైజ్ అధికారి ఎం.ఎ. రజాక్, డీఎంహెచ్‌వో రాజేందర్, డీపీవో శ్రీనివాస్, డీపీఆర్వో విష్ణువర్ధన్, డీఆర్డీవో నాగవర్ధన్, డీవైఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి, సీడీపీవోలు నాగలక్ష్మి, నాగమణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మెప్మా పీడీ సుభాష్, ఐకేపీ మహిళలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.