Government Whip Adluri Laxman Kumar: ధర్మపురి, జనవరి 11 (మన బలగం): త్వరలోనే రోళ్లవాగు నిర్మాణం పూర్తి చేసి, ధర్మపురి రైతాంగ సాగు నీటికి శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మపురి మండలం దమ్మనపేట, రాజారాం, జైన గ్రామాల్లో విప్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాలకు చెందిన రైతులను కలిసి వారితో మాట్లాడారు. గోదావరిలో నీరు లేక రైతులు పడుతున్న ఇబ్బందులను తాను, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డితోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఒక టీఎంసీని విడుదల చేయాలని కోరామని, ఈ మేరకు నీటినీ విడుదల చేయాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. మధ్యాహ్నం నీటిని గోదావరిలోకి విడుదల చేస్తారని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.