- ఫోన్ ట్యాపింగులో కీలక విషయాలు వెలుగులోకి
- రాధాకిషన్ రావు, భుజంగరావు స్టేట్‌మెంట్లలో వెల్లడి
- సొంత పార్టీ నేతలనూ వదలని అధినేత
- బెడిసికొట్టిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం
- లిక్కర్ కేసు నుంచి కవితను బయట పడేసే ఎత్తు చిత్తు
KCR behind phone tapping: ‘ఫోన్ ట్యాపింగ్‌తో మాకేం సంబంధం అండీ..’ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల టీవీ ఇంటర్వ్యూలో దబాయించి మాట్లాడడం.. ‘టెలిఫోన్ ట్యాపింగ్‌తో నాకు సంబంధమే లేదు, అయినా ఒకరో ఇద్దరో లంగలు, లఫంగల ఫోన్లు పోలీసులు ట్యాపింగ్ చేసి ఉండొచ్చు.’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లు మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నమే అని తేలిపోయింది. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టారీతిన వ్యవహరించడం, అడ్డం వచ్చిన వారిని తొడ్డమే పనిగా పెట్టుకున్నారు. కాగా టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఇంటలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తమ కన్ఫెషన్ స్టేట్‌మెంట్లలో గత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే తాము స్వామిభక్తితో ఇవన్నీ చేసినట్లు నేర అంగీకార పత్రాల్లో సదరు పోలీస్ అధికారులు ఒప్పుకోవడం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.
ప్రజాస్వామ్య భరతావనిలో.. ఇంకా రాచరిక పుండు..సలుపుతోందా? అధికారం ఉన్నదనే అహంభావంతో కన్నూ మిన్నూ కానకుండా తామే సార్వభౌమాధికారులం, చక్రవర్తులం అనే రీతిలో సాగించిన పాలన తిరోగమన పతనానికి దారి తీస్తోందని ఏమాత్రం ఊహించి ఉండకపోవచ్చు. రాజ్యకాంక్ష కోసం ఎంతకు బరి తెగించారనేది గత పాలకుల వైఖరి ఇప్పుడు తెలంగాణ ప్రజలకే కాదు యావత్ దేశ ప్రజలకు సైతం విస్మయం గొలుపుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తదుపరి అధికార పగ్గాలు చేపట్టిన పదేళ్లూ విపక్షాలను నిర్వీర్యం చేయడం, ప్రజా సంఘాల నోరు మూయించడం, ఎదిరించి మాట్లాడేవారిని శత్రువులుగా పరిగణించడం… ఇలాంటి ఎన్నో ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అవలంబించారు. ముఖ్యంగా సమాచార విప్లవంలో భాగంగా టెలిఫోన్లు మూలన పడి ఇంటింటికి సెల్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇదే అదనుగా, తమ రాజకీయ స్వార్థం కోసం, అహంభావ అధికారం కోసం అనేక అడ్డదారులు తొక్కారు. ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నా వినేందుకు ఫోన్ ట్యాపింగ్‌ను గత పాలకులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు.
సొంత పార్టీ నేతల ఫోన్లూ ట్యాప్
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు కవ్వంపల్లి సత్యనారాయణ, జువ్వాడి నర్సింగ్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డి కుమారుడు రఘు వీర్ రెడ్డి, బీజేపీ నాయకులు బండి సంజయ్, ఈటల రాజేందర్, అర్వింద్, వెంకట రమణా రెడ్డి తదితరుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఇంటలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తమ కన్ఫెషన్ స్టేట్‌మెంట్లలో అంగీకరించారు. ఇంకా విచిత్రం ఏమిటంటే సొంత పార్టీలో నాయకులకు కూడా నమ్మని గత ప్రభుత్వ అధినేత… కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య, తీగల కృష్ణా రెడ్డి, శంబీపూర్ రాజు, పట్నం సునీత, మహేందర్ రెడ్డి తదితరుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించారట! ఇంకా విచిత్రం ఏమిటంటే, విపక్ష నేతలతో పాటు హైకోర్టు జడ్జిలు, విద్యార్థి సంఘ నాయకులు, జర్నలిస్టులు, పత్రికలు, టీవీ చానల్స్ యజమానులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే తీన్మార్ మల్లన్న లాంటి వాళ్లపై ఫోన్ ట్యాపింగ్ చేసి, ఎక్కడి వారిని అక్కడే కట్టడి చేశారు.
పోలీసు వాహనాల్లో డబ్బు తరలింపు
తమ సామాజిక వర్గానికే చెందిన ప్రభాకర్ రావును ఇంటలిజెన్స్ చీఫ్ (ఓఎస్డీ)గా నియమించుకొని గత ప్రభుత్వ అధినేత టెలిఫోన్ ట్యాపింగ్ అంకానికి తెర తీశారు. ప్రభాకర్ రావు సైతం తమ సామాజిక వర్గానికి చెందిన వారందరినీ ఒక టీమ్‌గా తయారు చేసుకొని విపక్షాలను ఎక్కడికక్కడ ఆర్థికంగా నిర్వీర్యం చేయడం, వాళ్లు ఫోన్లలో మాట్లాడుకునేది అధినేతకు చేరవేయడం, ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పోలీస్ వాహనాల్లోనే డబ్బులు తరలించి ఓటర్లకు పంచేందుకు ఇతోధికంగా సహాయం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఇంకా..రోత కలిగించే విషయం ఏమిటంటే, భార్యా భర్తల సంభాషణలు విని పైశాచిక ఆనందం పొందారట. గత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే తాము స్వామిభక్తితో ఇవన్నీ చేసినట్లు నేర అంగీకార పత్రాల్లో సదరు పోలీస్ అధికారులు ఒప్పుకోవడం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.
ప్రభాకర్ రావు అరెస్టుకు రంగం సిద్ధం
ఇటీవల టీవీ ఇంటర్వ్యూలో సైతం ‘ట్యాపింగ్‌తో మాకేం సంబంధం అండీ..’ అంటూ గత ముఖ్యమంత్రి దబాయించడం అందరూ చూసే ఉంటారు. ‘టెలిఫోన్ ట్యాపింగ్‌తో నాకు సంబంధమే లేదు, అయినా ఒకరో ఇద్దరో లంగలు, లఫంగల ఫోన్లు పోలీసులు ట్యాపింగ్ చేసి ఉండొచ్చు.’ అని మాజీ మంత్రి చిలుక పలుకులు పలికారు. విదేశాల నుంచి ప్రభాకర్ రావును రప్పించేందుకు కోర్టు అనుమతితో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ప్రభాకర్ రావు ఎక్కడ ఎయిర్ పోర్ట్‌లో దిగినా, వెంటనే అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. విచారణలో ఆయన చెప్పే విషయాల ఆధారంగా ఫోన్ ట్యాపింగ్‌లో ఎవరెవరి హస్తం ఉన్నది తేటతెల్లం అవుతుంది.
రాజగోపాల్ రెడ్డికి చెక్
నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా ‘ఎరక్కపోయి వచ్చాము, ఇరుక్కుపోయాము’ అనేది పాత సామెత. ‘ఎర కోసం వచ్చాము, ఎర్రి పుష్పాలు అయ్యాము’ అనేది నేటి సామెత. ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి కేసీఆర్ తనయ కవితను తప్పించాలంటే, అందుకు గట్టి స్కెచ్(ప్లాన్) అవసరం. ఉప ఎన్నికల్లో బీజేపీ దుబ్బాక, హుజురాబాద్‌లలో గెలిచి మంచి ఊపు మీద ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీని వదిలిపెట్టి బీజేపీ తరఫున మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి నిలిచారు. అప్పటికే రెండు స్థానాల్లో (దుబ్బాక, హుజురాబాద్ ) బీజేపీ చేతిలో పరాభవం తట్టుకోలేని బీఆర్ఎస్ అధినేత ఫోన్ ట్యాపింగ్‌ను నమ్ముకొని రాజగోపాల్ రెడ్డి ఆర్థిక మూలాలు దెబ్బ తీశారు.
బెడిసి కొట్టిన ఎమ్మెల్యేల కొనుగోలు
ఇదే సందర్భంలో తాండూర్ ఎంఎల్ఏ పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు ఫోన్ ట్యాపింగ్‌లో కనిపెట్టిన సదరు పోలీస్ అధికారులు విషయాన్ని అధినేత చెవిలో వేశారు. పైలట్‌ను తన దగ్గరకు పిలిపించుకొని స్క్రీన్ ప్లే రెడీ చేశారు. మరో ముగ్గురు (రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి) స్వామి భక్తి ప్రదర్శించే ఎంఎల్ఏలను కలుపుకొని మొయినాబాద్ ఫామ్ హౌస్ కుట్రకు తెరలేపారు. టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్‌లను ఢిల్లీ పంపించి అత్యాధునిక పరికరాలు తెప్పించారు. ముందే వేసుకున్న స్కెచ్ కాబట్టి ఎంఎల్ఏలను కొనడానికి వచ్చిన వాళ్ల మొహాలు స్పష్టంగా కనిపించాలి. మాటలు స్పష్టంగా వినిపించాలి కాబట్టి కొత్త పరికరాలు కొనుగోలు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను నిందితునిగా చిత్రీకరించి అరెస్టు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి బృందం ప్రత్యేక చాఫ్టర్‌లో కేరళ వెళ్లినా, వట్టి చేతులతో తిరిగి రావడం వల్ల పెద్దాయన ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యారు.
లిక్కర్ కేసులో కూతురును తప్పించాలని
ఆర్ఎస్ఎస్, బీజేపీలలో ప్రధాన నేత అయిన బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేసే నెపంతో బీజేపీతో ఆట ఆడాలనుకొని అడ్డంగా బుక్ అయ్యాడు పెద్ద సారు. తన కూతురు కవితను లిక్కర్ కేసు నుంచి బయటకు పడేయాలంటే సంతోషజీని అడ్డం పెట్టుకొని బీజేపీ పెద్దలను తన వద్దకు రప్పించుకొని చక్రం తిప్పాలనుకున్న పెద్ద సారు ప్లాన్ ఫెయిల్ అయింది. ఎంఎల్ఏల కొనుగోలు కేసు సీబీఐకి బదలాయించడంతో చేసేది ఏమి లేక మౌనమే శరణ్యం అయింది. ఈ విషయాలన్నీ రాధాకిషన్ రావు, భుజంగరావు తమ కన్ఫెషన్ స్టేట్మెంట్‌లలో అంగీకరించినవే. ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో వెల్లడించే అంశాలు ఇంకెన్ని చీకటి కోణాలను ఆవిష్కరిస్తుందో చూడాలి.