Exhibition: నిర్మల్, డిసెంబర్ 24 (మన బలగం): జిల్లా కేంద్రంలో నుమాయిష్ (ఎగ్జిబిషన్) ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కేంద్రంలో నుమాయిష్ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనవరి 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లాలో మొట్టమొదటిసారిగా నుమాయిష్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నుమాయిష్ నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నుమాయిష్‌లో జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో హస్తకళలు, పెయింటింగ్స్, చేతివృత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, మహిళా స్వయం సంఘాల ఉత్పత్తులు, పుస్తకాల స్టాల్‌లను ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఔత్సాహికులైన ప్రజల నుంచి కూడా తమ పేర్లను నమోదు చేయడం ద్వారా వారి వారి ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. జిల్లా చరిత్రను తెలిపే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలను ఆకర్షించే విధంగా వాల్ పోస్టర్లు ఏర్పాటు చేసి, అందమైన లైటింగ్‌తో ముస్తాబు చేయాలని, అధికారులంతా సమన్వయంతో పనిచేసి నుమాయిష్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా నూతన ఉత్పత్తులను వెలుగులోకి తేవడమే కాకుండా, జిల్లా ఖ్యాతిని మరింత పెరుగుతుందన్నారు. జిల్లా ప్రముఖులందరిని ఈ నుమాయిష్ కార్యక్రమానికి ఆహ్వానించాలని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నా కళ్యాణి, డిఆర్డిఓ విజయలక్ష్మి, డీఈవో పి.రామారావు, డీవైఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, డీఎస్‌వో కిరణ్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.