Collector Abhilasha Abhinav: నిర్మల్, మార్చి 15 (మన బలగం): ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్ఆర్ఎస్ (లే అవుట్ల క్రమబద్ధీకరణ)కు దరఖాస్తు చేసుకున్న వారందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో మున్సిపాలిటీల పరిధిలలో 17906, గ్రామీణ ప్రాంతాలలో 6680 దరఖాస్తులను రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేందుకు అర్హమైనవిగా గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికే పలువురు దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లిస్తున్నారని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల పరిధిలలో ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ రుసుములో 25 శాతం రాయితీ కల్పించడం జరిగిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులంతా రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాలని తెలిపారు. మార్చి 31వ తేదీతో లే అవుట్ల దరఖాస్తుల రుసుము చెల్లించే గడువు ముగుస్తుందన్నారు. గడువు ముగిసిన తర్వాత మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉండదని, కావున దరఖాస్తుదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన రుసుములు చెల్లించాలని ఆ ప్రకటనలో కలెక్టర్ తెలిపారు.