Collector Abhilasha Abhinav
Collector Abhilasha Abhinav

Collector Abhilasha Abhinav: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

Collector Abhilasha Abhinav: నిర్మల్, మార్చి 15 (మన బలగం): ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలలో విద్యాబోధన చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శనివారం నిర్మల్ గ్రామీణ మండలం మేడిపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్‌తో కలిసి ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్‌ను కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులకు కృత్రిమ మేధస్సు ద్వారా ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, గణితం సబ్జెక్టుల నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మల్ జిల్లాలో 16 ప్రభుత్వ పాఠశాలలలో ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్‌లను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఏఐ ఆధారిత విద్యా యాప్‌లు, ప్లాట్‌ఫామ్‌లు ప్రతి విద్యార్థి అభ్యాస స్థాయిని గుర్తించి, మెరుగుపరిచేందుకు ప్రత్యేక పాటాలను సూచిస్తాయని తెలిపారు. ఏఐ ఆధారిత యాప్‌లు కథలు, వీడియోలు, ఆటల ద్వారా పిల్లలలో చదవడం, లెక్కించడం మీద ఆసక్తిని పెంచుతాయని, కృత్రిమ మేధస్సును వినియోగించుకుని, ప్రతి విద్యార్థి ప్రాథమిక విద్యలో నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని కోరారు. ప్రతి విద్యార్థి ఆరోగ్య, విద్యా, ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతిరోజు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్నం భోజనం చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి.రామారావు, తహసిల్దార్ సంతోష్, ఎంపీడీవో గజేందర్, విద్యాశాఖ అధికారులు సలోని, ప్రవీణ్, లింబాద్రి, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు నాగరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *