Bandi Sanjay: మనబలగం, తెలంగాణ బ్యూరో: భారత మాజీ ప్రధానమంత్రి, బహుభాషావేత్త, అసాధారణ మేధావి పాములపర్తి వెంకట నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా ఆయనకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘన నివాళి అర్పించారు. ‘ఉమ్మడి కరీంనగర్ (ప్రస్తుత హన్మకొండ) జిల్లాలోని వంగర గ్రామంలో పుట్టిన పీవీ విద్యార్థి దశలోనే నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. తెలంగాణలో భూసంస్కరణలకు ఆద్యుడు పీవీ. రాజకీయవేత్త మాత్రమే కాదు, లాయర్‌గా, పత్రికా సంపాదకుడిగా పని చేశారు. ఆయన రచయిత కూడా. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘వేయిపడగలు’ అనే పుస్తకాన్ని హిందీ భాషలోకి ‘సహస్ర ఫణ్’ పేరుతో అనువదించిన గొప్ప రచయిత ఆయన. తెలుగు, సంస్కృతం, మరాఠీ, కన్నడం, ఉర్దూ, హిందీ వంటి భారతీయ భాషలతో పాటూ ఇంగ్లీష్, ఫ్రెంచ్ వంటి మొత్తం 17 భాషల్లో అనర్ఘళంగా ప్రసంగించ గలిగిన మహాపండితుడు పీవీ. దేశ ప్రధాని పదవిని అధిష్టించిన మొట్టమొదటి దక్షిణ భారతీయుడిగా, తెలంగాణ ముద్దుబిడ్డగా పీవీ చరిత్ర సృష్టించారు. దురదృష్టకరమైన విషయమేందంటే… దేశానికి సేవ చేసిన అంత గొప్ప వ్యక్తిని ఆయన సొంత పార్టీ కాంగ్రెస్ అడుగడుగునా అవమానిస్తే, దేశానికి విశేష సేవలందించిన పీవీ నర్సింహారావుకు అత్యున్నత భారతరత్న పురస్కారంతో సముచిత స్థానం కల్పించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వానికే దక్కింది.’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.