- ఇచ్చిన హామీ మేరకు మోడీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది
- మోడీ పాలనలో ఆర్థిక ప్రగతిలో 5వ స్థానానికి చేరుకున్నాం
- హైదరాబాద్ హకీంపేట ఎన్ఐఎస్ఏ అకాడమి ‘రోజ్ గార్ మేళా’
Bandi Sanjay Kumar: మనబలగం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. వేలాది మంది నిరుద్యోగ యువత ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను హైదరాబాద్‌లోని అశోక్ నగరలో ఒక్కపూట భోజనమే తింటూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్లను ఎంతో మందిని చూశానన్నారు. ఈ తరుణంలో మోదీ ప్రభుత్వం కేంద్ర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండటం హర్షణీయమన్నారు. 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని గతంలో ప్రధానమంత్రి మోదీ మాట ఇచ్చారని, దానికి కట్టుబడి నేటి వరకు ‘రోజ్ గార్ మేళా’ పేరుతో 9.25 లక్షల మందికి నియామక పత్రాలను అందజేశామన్నారు. సోమవారం దేశవ్యాప్తంగా 71 వేల మందికి నియామక పత్రాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ హకీంపేట నేషనల్ ఇండస్ట్రీయల్ అకాడమీలోని అంతరిక్ష కేంద్రం ఆడిటోరియంలో నిర్వహించిన ‘రోజ్ గార్’ మేళా కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ఎన్ఐఎస్ఏ డైరెక్టర్ సునీల్ ఇమ్మాన్యూయెల్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసబాబుతో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, ఉద్యోగ పత్రాలు అందుకోబోతున్న 300 మందికిపైగా అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు. ‘ఈరోజు దేశవ్యాప్తంగా 71 వేల మంది నియామక పత్రాలు అందుకునే కార్యక్రమం. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇష్టమైన కార్యక్రమం రోజ్ గార్ మేళా. ఉద్యోగాల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రధాని మోదీ. 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. 2022 అక్టోబర్ 22న ప్రారంభమైన రోజ్ గార్ మేళా నేటికీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు గత 13వ రోజ్ గార్ మేళా ద్వారా 8,54,000 ఉద్యోగాలను భర్తీ చేశారు. నేటితో కలిపి 9 లక్షల 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లయింది. ఇక మిగిలింది 75 వేలు మాత్రమే. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలుంటే.. ఇతర ఉద్యోగులపై భారం పడుతోంది. తద్వారా మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించడం కష్టమైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు ఏ శాఖలో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసిన దాఖలాల్లేవ్. ఆ ఘనత మోదీకే దక్కుతోంది. వాస్తవానికి ఒక్కో పోస్టుకు భారీ ఎత్తున పోటీ నెలకొంది. ఆ పోటీని తట్టుకుని పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగం సాధించిన అభ్యర్థులందరికీ అభినందనలు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో భారత్ ఆర్థిక ప్రగతిలో అగ్రభాగాన నిలిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. గతంలో 11వ స్థానంలో ఉన్న భారత్‌ను 5వ స్థానంలో నిలిపారు. మరో మూడేళ్లలో 3వ స్థానానికి తీసుకువచ్చే దిశగా పనిచేస్తున్నారు. అట్లాగే భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా అప్పటికి అమెరికా, చైనాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ కావాలన్నదే మోడీ ఆకాంక్ష. మోడీ కృషిలో మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా. గతంలో మోడీ 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటిస్తే, ప్రతిపక్షాలు హేళన చేశాయి. కానీ ఆర్బీఐ నివేదిక ప్రకారం భారత్ ఆర్థిక వ్యవస్థ 4 కోట్ల 66 లక్షల ఉద్యోగాలను సృష్టించినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. మట ఇస్తే నెరవేర్చే ప్రభుత్వం నరేంద్రమోడీదే. గతంలో క్రమం తప్పకుండా వివిధ శాఖల్లోని ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసిన దాఖల్లేవు. ఆ ఘనత మోడీకే దక్కుతోంది. కరోనా హయాంలో అమెరికా సహా ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతే ఆత్మ నిర్భర్ ప్యాకేజీతో భారత్‌ను ఆర్థికంగా స్థిరంగా ఉంచిన ఘనత మోడీ ప్రభుత్వానిదే. మోడీ హయాంలో ఉద్యోగాలు కోరుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారు.
పేదలకు బ్యాంకు ఖాతాలు లేని పరిస్థితుల్లో ‘జన్ ధన్ ఖాతా’లను జీరో బ్యాలెన్స్ తో ప్రారంభిస్తామని చెబితే ప్రతిపక్షాలన్నీ హేళన చేశాయి. ఈరోజు దేశంలో బ్యాంకు ఖాతా లేని ప్రతి ఒక్కరికి జన్ ధన్ ఖాతాను ప్రారంభించి నయాపైసా అవినీతికి తావులేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నగదును నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఒకనాడు నిత్యావసర వస్తువులు సహా అనేక వస్తువులను భారత్ దిగుమతి చేసుకునేది. మోడీ హయాంలో బియ్యం, నిత్యావసర వస్తువులుసహా అనేక ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకొచ్చారు. ఇకపై దేశంలోని ప్రతి ఒక్కరూ లక్ష్యం నిర్దేశించుకుని ఆ దిశగా పనిచేయాలని కోరుతున్నా. ముఖ్యంగా ఈ రోజు నియామక పత్రాలు అందుకోబోతున్న 71 వేల మంది అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుగా మారబోతున్నారు. వారంతా చిత్తశుద్ధితో మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి. మారుమూల ప్రాంతాలకు సేవలు విస్తరించేందుకు కృషి చేయాలి. తద్వారా శక్తిమంతమైన భారత్‌గా అవతరించి విశ్వగురుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. గతంలో పోస్టల్ ఉద్యోగులు సమ్మె చేయడంవల్ల కొత్తగా ఉద్యోగాలు పొందిన 1200 మంది తెలంగాణ ఉద్యోగులు సస్పెన్షన్ కు గురయ్యారు. సంబంధం లేని అంశంలో సమ్మె చేయడంతో వారు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ విషయంపై తాను ప్రధానమంత్రి మోదీతోపాటు సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వారిపై సస్పెన్షన్ ఎత్తివేయించాం.
దయచేసి ఉద్యోగులంతా సంబంధం లేని అంశాలపై సమ్మె చేసి మీ జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దని సూచిస్తున్నా. కొత్తగా ఉద్యోగంలో చేరబోతున్న ఉద్యోగులంతా సంబంధం లేని అంశాలపైనో, ఇతరులు చెప్పారనో లేనిపోని సమ్మెలు చేసి ఇబ్బంది పడొద్దు. మీకు ఏదైనా సమస్య ఉంటే మీ పై అధికారులు, మా దృష్టికి తీసుకొని రండి. ఎందుకంటే రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. నిరుద్యోగులు ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుంటూ తిండికి లేక ఇబ్బంది పడుతున్నారు. నేను హైదరాబాద్ లోని అశోక్ నగర్‌లోని అనేక కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలకు వెళ్లినప్పుడు తిండికి పైసల్లేక పస్తులుంటూ చదువుకుంటున్న వేల మంది నిరుద్యోగులు నా కళ్ల ముందు తారసపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేయడంలో విఫలమవుతోంది. గత పాలకులు పేపర్ లీకుల పేరుతో పరీక్షలను ఏళ్ల తరబడి వాయిదా వేసింది. నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నిరంతరం క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగ సమస్యను తగ్గిస్తోంది. దీంతోపాటు స్వయం ఉపాధి కల్పించడం, ప్రైవేట్ రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఈ సందర్భంగా కొత్తగా కేంద్ర ఉద్యోగులుగా మారబోతున్న ఉద్యోగులంతా కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నా.’ అని బండి సంజయ్ తెలిపారు.