Applications for Indiramma houses: నిర్మల్, డిసెంబర్ 23 (మన బలగం): ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునే వారి వివరాలు ఆన్‌లైన్‌లో లభ్యంగా లేనట్లయితే, ఆఫ్‌లైన్ విధానంలో సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇందిరమ్మ ఇండ్ల నోడల్ అధికారి ఫైజాన్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైనప్పటికీ సర్వేలో తమ పేర్లు లేనివారు, గతంలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లకై దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాని యెడల తెల్ల కాగితంపై దరఖాస్తు రాసి, ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసినప్పుడు ఇచ్చిన రశీదు జిరాక్స్ కాపీని దరఖాస్తునకు జత చేసి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎంపీడీవో కార్యాలయాలలో, పట్టణ ప్రాంత ప్రజలు మున్సిపల్ కార్యాలయాలలో తమ దరఖాస్తులను సమర్పించవచ్చునన్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించి ఇందిరమ్మ ఇండ్ల సర్వే కొరకై పరిగణలోకి తీసుకుంటామని ఆ ప్రకటనలో తెలిపారు.