- బీఆర్ఎస్‌కు బిగ్ షాక్
- కాంగ్రెస్‌లోకి లక్ష్మీపుత్రుడు
- పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం
- కేసీఆర్‌కు విధేయుడిగా పేరు
- మంత్రి పదవి వరించే అవకాశం
- పోచారం ఇంటి వద్ద హైడ్రామా
- రేవంత్‌ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణుల యత్నం
- బీఆర్ఎస్ఎల్పీ విలీనం దిశగా అడుగులు
- నా రాజకీయ ప్రయాణం కాంగ్రెస్‌తోనే మొదలైంది: పోచారం
- అండగా ఉంటామన్నారు : రేవంత్ రెడ్డి
Pocharam Srinivas Reddy: బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఉదయం రేవంత్ రెడ్డి, మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని పోచారం నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పోచారం సీఎంకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి ఇంట్లోకి ఆహ్వానించారు. అనంతరం వీరు కొద్ది సేపు ఏకాంతంగా భేటీ అయినట్లు సమాచారం. అనంతరం సీఎం ఆహ్వానం మేరకు పోచారం, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
పోచారం ఇంటి వద్ద హైడ్రామా
అయితే పోచారం ఇంటికి రేవంత్ వెళ్లిన సందర్భంగా కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొన్నది. బీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ టికెట్‌తో గెలిచి, పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోచారం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కల్పించుకొని కార్యకర్తలను అడ్డు తొలగించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోచారంను కలిసే ప్రయత్నం చేయగా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
లక్ష్మీపుత్రుడు అంటూ కేసీఆర్ కితాబు
తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తరువాత మొదటి మంత్రి మండలిలో పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యవసాయశాఖను కేటాయించారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడంతోనే రాష్ర్టంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, పంటలు బాగా పండుతున్నాయని, అందుకే పోచారం లక్ష్మీపుత్రుడు అని కేసీఆర్ పలు సందర్భాల్లో కొనియాడారు. ‘మిమ్మల్ని జన్మలో మరువను సార్.. ప్రాణం ఉన్నంత వరకు మీరే మా నాయకుడు సార్.. ఇంకొకరు లేరు సార్..’ అంటూ పోచారం సైతం కేసీఆర్‌ను పొగిడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరో వైపు పోచారం సైతం కేసీఆర్‌కు విధేయుడిగా కొనసాగుతూ వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోచారం బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా గులాబీ పార్టీ అధికారం చేపట్టలేకపోయింది. బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకూ తీసికట్టుగా మారుతుండడంతో పోచారం భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా పార్టీ మారినట్లు తెలుస్తోంది.
పోచారానికి మంత్రి పదవి ఆఫర్?
ప్రస్తుత రాజకీయ సమీకరణ దృష్ట్యా పోచారంను మంత్రి పదవి వరించనున్నట్లు తెలుస్తోంది. పలు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలువడం, మంత్రిగా పని చేసిను అనుభవం ఉండడంతో పోచారానికి మంత్రి పదవి తప్పకుండా వస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పట్టున్న నాయకుడు కావడం, ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి పోచారం చేరికపై ఆసక్తి కనబర్చినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మార్పుపై పోచారం స్పందిస్తూ తన రాజకీయ ప్రయాణం మొదలైంది కాంగ్రెస్ పార్టీ నుంచేనని తెలిపారు. రేవంత్‌ను తానే ఇంటికి ఆహ్వానించానని, రైతు పక్షపాతిగా, ఆయన ఎన్నో మంచి పనులు చేస్తున్నారని కొనియాడారు. రాజకీయంగా ఇంకా తాను ఆశించేది ఏమీ లేదని, తాను ఆశించేది రైతు సంక్షేమమేనని తెలిపారు. ప్రభుత్వానికి అండగా ఉండి రైతు సంక్షేమానికి కృషి చేస్తానని వెల్లడించారు.
శ్రీనివాసరెడ్డి అండగా ఉంటామన్నారు : రేవంత్ రెడ్డి
కాగా పోచారం శ్రీనివాసరెడ్డి సలహాలు, సూచనలు ప్రభుత్వానికి అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం నిర్వహించే కేబినెట్ భేటీలో రైతు సమస్యలపై తీసుకోనున్న కీలక నిర్ణయాల గురించి ఆయనతో చర్చించినట్లు స్పష్టం చేశారు. పార్టీలోని సీనియర్ల మాదిరిగానే శ్రీనివాసరెడ్డికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తారని ప్రకటించారు.
కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కే.కేశవరావు కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా కేసీఆర్ విధేయుల్లో ఒకరైన పోచారం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఎదురు దెబ్బలతో అవస్థలు పడుతున్న బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలినట్లైంది.
బీఆర్ఎస్ఎల్పీ విలీనం?
రివేంజ్ పాలిటిక్స్‌ను ఫాలో అవుతున్న రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొందరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందు కోసం 13 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నట్లు తెలిసింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకున్నట్లు సమాచారం. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయనే చెప్పకనే చెప్పినట్లైంది.
పోచారం రాజకీయ ప్రస్థానం
1949 ఫిబ్రవరి 10న పోచారం శ్రీనివాసరెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామంలో జన్మించారు. పోచారం అసలు ఇంటి పేరు పరిగె. ఆ గ్రామంలో జన్మించడంతో ఊరిపేరే ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. పరిగె రాజారెడ్డి, పాపమ్మల సంతామనే శ్రీనివాసరెడ్డి. ఆయన భార్య పుష్మ, ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. దేశాయిపేట సింగిల్ విండో చైర్మన్‌గా 1978లో ఆయన ఎన్నికయ్యారు. అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. నిజామాబాద్ కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా పనిచేశారు. 1989లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 1994లో మొదటి సారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 1998లో రెండోసారి గెలిచి టీడీపీ హయాంలో గృహనిర్మాణ శాఖ మంత్రి, భూగర్భ గనుల శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004లో ఓటమి చవిచూశారు. 2009లో మళ్లీ విజయం సాధించారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల మంత్రిగా పనిచేశారు. 2018లో ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ శాసన సభకు స్పీకర్‌గా పనిచేశారు.