- మరాఠీ టీవీ చానల్ స్టార్ ప్రవాహలో అవకాశం
- మీ హోనార్ సూపర్ స్టార్ చోటే ఉస్తాద్‌కు ఎంపిక
Singer Anjali: పిట్ట కొంచం, కూత ఘనం అన్నట్లు ముధోల్ మండల కేంద్రంలోని నాగార్జున నగర్‌కు చెందిన అంజలి గడ్పాలే సింగర్‌గా రాణిస్తున్నది. ముధోల్ మండల కేంద్రంలోని నాగార్జున నగర్‌కు చెందిన బింబిసాగర్, మౌనిక గడ్పాలే దంపతుల కూతురు అంజలి ఆరో తరగతి చదువుతోంది. మహారాష్ర్టకు చెందిన సుప్రసిద్ధ గాయకులు వామన్ దాదా శిష్యులు ప్రతాప్ సింగ్ దేవా ఆంబోరే చిన్నారిని సన్మానించారు. తెలంగాణతోపాటు మహారాష్ర్టలోని నాందేడ్, అకోలా, యావత్ మాల్, పూసద్, భోకర్, బిలోలి, ధర్మాబాద్, ముత్కేఢ్ తదితర ప్రాంతాల్లో తన గానమాధుర్యంతో అలరించింది. ఆనంద్ కీర్తనే, ప్రతాప్ సింగ్, దాదా బోదడే, నాగ్‌సేన్ దాదా సావదేకర్, అశోక్ నికాల్జె మేఘనంద్ జాదవ్, అజయ్ దేహడే, స్వప్న కరత్, అంజలి గోడకే, చేతన్ లోఖండే, విక్రాంత్ రాజ్‌పుత్, మంజూష సిందే వైభవ్ ఖునే, మాధవ్ వాడవేతో కలిసి పాటలు పాడారు. ఆదిలాబాద్, భైంసా, ముధోల్, నిర్మల్ ప్రాంతాల్లో స్టేజి షోల ద్వారా ప్రదర్శనలు ఇచ్చింది. అతి పిన్న వయస్సులో తన గాన మాధుర్యాన్ని పంచుతూ అందరి మన్ననలు పొందుతోంది.
బహుముఖ ప్రజ్ఞాశాలి అంజలి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంగ్స్, భక్తి పాటలు, సినిమా పాటలు ఇలా వివిధ విభాగాల్లో పాటలు పాడుతూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. పాటల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ మరాఠీ టీవీ చానల్ స్టార్ ప్రవాహలోని మీ హోనార్ సూపర్ స్టార్ చోటే ఉస్తాద్ కార్యక్రమానికి ఎంపికైనట్లు అంజలి బింబిసార్ తెలిపారు. స్టార్ ప్రవాహ మరాఠీ చానల్‌లో శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతున్న మీ హోనార్ స్టార్ చోటే ఉస్తాద్ సీజన్-3 కార్యక్రమం ప్రసారం కానుంది. అంజలి పాటలు పడడంతోపాటు హార్మోనియం వాయించడంలోనూ ప్రావీణ్యం సంపాదించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే సింగర్‌గా రాణిస్తున్నట్లు అంజలి తెలిపింది. గానకోకిల లతా మంగేష్కర్, ఆశా భోస్లే వంటి ప్రముఖ గాయకుల సరసన చేరాలన్నదే తన ఆకాంక్ష అని అంజలి వెల్లడించింది.