social survey
social survey

social survey: ప్రణాళికా బద్ధంగా సామాజిక సర్వే నిర్వహించాలి.. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

social survey: నిర్మల్, అక్టోబర్ 29 (మన బలగం): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, కుల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం వివిధ జిల్లాల నుంచి పలువురు మంత్రులతో కలిసి హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ నుంచి జిల్లాల కలెక్టర్లతో సమగ్ర ఇంటింటి సర్వే పై ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, సమగ్ర సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వేకు సంబంధించి విధివిధానాలను అధికారులకు తెలియజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోవు ఈ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సర్వే నిర్వహణకు సంబంధించి ఇప్పటికే జిల్లాకు ఐదుగురు చొప్పున అధికారులతో 240 మంది అధికారులకు హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులకు శిక్షణలు నిర్వహించాలన్నారు.

సర్వేలో భాగంగా ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన కుటుంబాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, నమోదు చేసే వివరాలు ఖచ్చితత్వంతో సమయానుసారంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి ఎన్యుమరేటర్ 150 నుంచి 175 కుటుంబాల సర్వేను నిర్వహించాలన్నారు. ఎన్యుమరేటర్లు నిర్వహించిన సర్వేలోని 10 శాతం సర్వే వివరాలను ర్యాండంమ్‌గా సూపర్‌వైజర్లు పరిశీలించాలన్నారు. సూపపర్‌వైజర్లు ఎన్యుమరేటర్ల సర్వే తీరును పర్యవేక్షించాలని ఆదేశించారు. సర్వేకు సంబంధించి జిల్లాలోని స్థానిక సంస్థల లేదా రెవెన్యూ అదనపు కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమించాలన్నారు. రోజువారీగా నిర్వహించిన సర్వే వివరాలను ఎప్పటికప్పుడు ప్రణాళిక శాఖకు అందజేయాలన్నారు. సర్వే కోసమై ప్రజలంతా వారి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ధరణి పట్టా పాస్ పుస్తకాలు అందుబాటులో ఉంచుకునే విధంగా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. అంతకముందు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్లను, అధికారులను ఆదేశించారు.

అధికారులంతా సమన్వయంతో పనిచేసి సర్వేను నిర్వహించాలన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తంకుమార్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, సీతక్కలు మాట్లాడుతూ, సమగ్ర సామాజిక, విద్య, ఉద్యోగ, ఆర్థిక రాజకీయ కుటుంబ సర్వేను ఎలాంటి తప్పులు, లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో సమగ్ర సామాజిక, ఆర్థిక కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి జిల్లాలో ఈ సర్వే ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా అధికారులకు శిక్షణ నిర్వహిస్తామని, అనంతరం మండల స్థాయి అధికారులకు శిక్షణను ఇవ్వాలని తెలిపారు. సర్వే పూర్తయిన ప్రతి ఇంటికి ప్రభుత్వం అందజేసిన స్టిక్కర్లను అతికించాలని సూచించారు. సర్వేను నిర్వహించడమే కాకుండా, సర్వే వివరాల డేటాను నమోదు చేయునప్పుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్‌లు, ప్రణాళిక అధికారి జీవరత్నం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *