women and child welfare: నిర్మల్, నవంబర్ 29 (మన బలగం): అంగన్‌వాడీల్లోని చిన్నారులకు మెరుగైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రి గార్డెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ న్యూట్రి గార్డెన్స్‌లో పెంచిన ఆకు కూరలు, కూరగాయలను చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు అందజేసే ఆహార తయారీకి ఉపయోగించాలన్నారు. ప్రతి ఒక్క చిన్నారి, గర్భిణి, బాలింతకు మధ్యాహ్న భోజనం, కోడిగుడ్డు, ఇతర పోషకాలను అందించి రక్తహీనత, ఎదుగుదల లోపం వంటి సమస్యలను నియంత్రించాలని తెలిపారు. చిన్నారులకు క్రమం తప్పకుండా బాలామృతాన్ని అందించాలన్నారు.
అంగన్వాడీలలో అందించే మధ్యాహ్నం భోజనానికి నాణ్యమైన సరుకులను మాత్రమే వాడాలని తెలిపారు. వస్తువుల గడువు తేదీ ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. చిన్నారులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని తెలిపారు. మండలాల వారీగా అంగన్వాడీల్లో నిర్వహిస్తున్న న్యూట్రి గార్డెన్స్, సామ్, మామ్ తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్రమం తప్పకుండా చిన్నారుల ఎత్తు, బరువు వివరాలను నమోదు చేసి నివేదికలను అందజేయాలన్నారు. అంగన్వాడీల పరిసరాలలో నిరంతరం పరిశుభ్రతను పాటించాలన్నారు. మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని ఆదేశించారు. సమావేశంలో ఎసిడిపిఓ నాగలక్ష్మి, సిడిపిఓలు నాగమణి, సరిత, సరోజిని, జిల్లా సమన్వయకర్త నిరంజన్ రెడ్డి, అన్ని మండలాల అంగన్వాడి పర్యవేక్షకులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
