Panchayat Elections: నిర్మల్, డిసెంబర్ 10 (మన బలగం): పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో సవరించిన ఓటరు జాబితా ప్రకారము నాలుగు కొత్త గ్రామ పంచాయతీలు కలుపుకొని మొత్తం 400 గ్రామపంచాయతీలో 3368 వార్డుల్లో 3368 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. పెరిగిన కొత్త గ్రామ పంచాయతీలలో ఖానాపూర్ మండలంలోని రంగపేట, కడెం మండలం న్యూ ధర్మాజీపేట, తానూర్ మండలం కళ్యాణి, కుబీర్ మండలం రాంసింగ్ తాండ గ్రామాలు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 2,33,687 మహిళా ఓటర్లు, 2,12,517 పురుష ఓటర్లు, 15 మంది ఇతర ఓటర్లతో కలుపుకొని మొత్తం 4,46,219 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఈ ఓటరు జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు ఉన్నట్లయితే మండల స్థాయిలో జరగబోవు సమావేశంలో రాత పూర్వకంగా అధికారులకు వివరిస్తే, వాటిని విచారించి తుది జాబితాను ప్రకటిస్థామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, డీఎల్పీవో రమేశ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్రావణ్ రెడ్డి, గండ్రత్ రమేశ్, సిరికొండ రమేశ్, గాజుల రవి, మజార్, నరేశ్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.