Sircilla Collector
Sircilla Collector

Sircilla Collector: సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం

నేటి నుంచి ఇంటింటికి వెళ్లనున్న ఎన్యూమరేటర్లు
Sircilla Collector: మనబలగం, సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)కు సర్వం సిద్దమైంది. ఆయా ఎన్యూమరేటర్ బ్లాకుల పరిధిలో ఇప్పటికే హౌస్ లిస్టింగ్ సర్వే పూర్తి అయింది. జిల్లాలోని అన్ని కుటుంబాల వివరాలు సేకరించేందుకు అధికారులు, సిబ్బందికి శిక్షణ ముగిసింది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) వివరాలు తెలుసుకోవాలనే సద్దుదేశంతో రాష్ట్ర ప్రభుత్వం సర్వేకు శ్రీకారం చుట్టింది. భవిష్యత్‌లో అమలు చేయనున్న ప్రతి పథకం, వివిధ ప్రణాళికలకు ఈ సర్వేలో సేకరించిన అన్ని వివరాలు కీలకం కానున్నాయి. జిల్లాలో మొత్తం 1 లక్షా 90 వేల 626 ఇండ్లు 1468 ఎన్యుమరేషన్ బ్లాకులలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. ప్రతి 150 ఇండ్ల సర్వేకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున కొంతమంది రిజర్వ్ సిబ్బందితో కలిపి మొత్తం 1488 ఎన్యూమరేటర్లు, 160 మంది సూపర్వైజర్లను నియమించారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే షెడ్యూల్‌పై విరివిగా ప్రచారం చేయనున్నారు. ఏ రోజు ఎక్కడ సర్వే చేస్తారనే విషయం ప్రజలకు తెలియజేయనున్నారు. సర్వే సమయంలో ప్రజలు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, పాస్ పుస్తకాలు అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజూ నిర్వహించే సర్వే వివరాలను ఎప్పటికప్పుడు ఎన్యూమరేటర్ మండల స్థాయిలో తహసిల్దార్ కార్యాలయంలో అప్పగించాల్సి ఉంటుంది. ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించారు. అవసరమైన మేర కంప్యూటర్లను సిద్ధం చేసుకున్నారు. ప్రతిరోజూ జరిగే సర్వే వివరాలను ఎంపీడీవో ఆధ్వర్యంలో సేకరించి ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయనున్నారు. ఆన్‌లైన్‌లో సర్వే డేటా ఎంట్రీ పర్యవేక్షణకు నాయబ్ తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇద్దరు సిబ్బందితో బృందం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)లో భాగంగా ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు హౌస్ లిస్టింగ్ చేశారు. అక్కడక్కడా మిగిలిన ఇండ్ల సర్వే కూడా 6వ తేదీ నుంచి శుక్రవారం వరకు పూర్తి అయింది. సర్వేలో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 56 ప్రధాన, 19 అనుబంధ ప్రశ్నలు ఉన్నాయి. ఇవి రెండు పార్టులుగా, 8 పేజీల్లో వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. జిల్లాలోని ప్రతి కుటుంబం వివరాలు సేకరించేందుకు అధికారులు, సిబ్బందికి శిక్షణ ముగిసింది.

నేటి నుంచి ఇంటింటికి: ఇంటింటి కుటుంబ సర్వేకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. సర్వేలో మహిళనే గృహ యజమానిగా గుర్తిస్తూ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల, రాజకీయాలకు సంబంధించిన వివిధ అంశాల్లో సమాచారాన్ని సేకరించనున్నారు.

ఇవీ ముఖ్యాంశాలు: పార్టు-1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు, విద్య, ఉపాధి, భూముల వివరాలు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసల సమాచారం, రాజకీయ వివరాలు లాంటి అంశాలు ఉంటాయి. పార్టు-2లో కుటుంబ స్థాయికి సంబంధించిన మొత్తం 17 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 7 ప్రధాన, మిగతావి అనుబంధ ప్రశ్నలు ఉంటాయి. భూమి వివరాలు సేకరించే క్రమంలో ధరణిలో నమోదైన పట్టా నెంబరు, భూముల రకాలు (మెట్ట, తరి, పడావు) వంటి వివరాలను ఎకరాలుగా ఇవ్వాలి. సాగు విస్తీర్ణం, నీటి వనరు, కౌలు భూమి సాగు వంటి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

రిజర్వేషన్లు పొందిన వారికి ప్రశ్నలు: విద్య, ఉద్యోగం కోసం రిజర్వేషన్ల సదుపాయం పొందినా, గత ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన పథకాలు ఉన్నా, వాటి వివరాలు నమోదు చేయాలి.

రాజకీయ సమాచార సేకరణలో భాగంగా: ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారి వివరాలు, పదవీ కాలం, నామినేటెడ్ వివరాలను నమోదు చేస్తారు. వలసలు, ఉద్యోగం, ఉపాధి వివరాలు కూడా సేకరిస్తారు. ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వలస వెళ్లిన కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తారు. ఉపాధి, వార్షిక ఆదాయం, వ్యాపారులైతే వార్షిక టర్నోవర్, సంప్రదాయ కులవృత్తుల వివరాలను నమోదు చేయాలి. సర్వే సమయంలో ఫొటోలు, పత్రాలు తీసుకోరు. కుటుంబ యజమాని ఉండి ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. అనవసరమైన అపోహలు చెందరాదు.
ఇతర ముఖ్య అంశాలు: విద్యా వివరాలు, వైవాహిక స్థితి, దివ్యాంగుల వివరాలు, పశుసంపద, రేషన్ కార్డు నెంబరు, తాగునీటి వనరు, విద్యుత్ సదుపాయం తదితర వివరాలు సేకరిస్తారు. ఈ సర్వే ద్వారా తెలంగాణ ప్రభుత్వం కుటుంబ స్థితిగతులపై సమగ్ర సమాచారాన్ని సేకరించి, భవిష్యత్తు సంక్షేమ పథకాల రూపకల్పనలో ఉపయోపడే విధంగా వినియోగించుకోనున్నారు.

అవసరమైన సమాచారం ఇవ్వాలి: సందీప్ కుమార్ ఝా, సిరిసిల్ల కలెక్టర్
సర్వే సమయంలో ఆధార్ కార్డులు, భూమి వివరాలకు ధరణి పాస్ పుస్తకాలు, బ్యాంక్ ఖాతా దగ్గర ఉంచుకోవాలి. ఈ సర్వే చాలా కీలకం. ప్రతి కుటుంబం అందుబాటులో ఉండి సంబంధిత సమాచారాన్ని ఇవ్వాలి. సర్వేకు వచ్చే వారికి సహకరించాలని విజ్ఞప్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *