Calendar release: కరీంనగర్, జనవరి 18 (మన బలగం): శనివారం అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రూపొందించిన 2025 క్యాలెండర్‌ను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి.నరేందర్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో యువతి, యువకులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ఏఐవైఎఫ్ పోరాటాలు చేస్తుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువజన అభివృద్ధి కోసం, ఉపాధి అవకాశాలు కల్పన కోసం ఒక నిర్దిష్టమైన విధి విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని వారు పున ఉద్ఘాటించారు. దేశంలో రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందని, ఇది దేశానికి అత్యంత ప్రమాదకరమని, యువశక్తిని వినియోగించుకోలేని ఏ దేశమైనా ముందుకు సాగలేదని, ఇది చారిత్రాత్మక సత్యమని ఇది పాలకులు మర్చిపోకూడదని ఆయన అన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భామండ్లపల్లి యుగంధర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బోనగిరి మహేందర్, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పంజాల శ్రీనివాస్,నాయకులు చెంచల మురళి, లింగంపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.