MLA Rama Rao Patel: ముధోల్, నవంబర్ 11 (మన బలగం): ముధోల్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఇరిగేషన్, అభివృద్ధిలో ఆయా పార్టీల నాయకులు భాగస్వామ్యం కావాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరారు. నియోజకవర్గం కేంద్రమైన ముధోల్‌లో సోమవారం మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల జూనియర్ కళాశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. విద్య, వైద్యం, ఇరిగేషన్, అభివృద్ధిలో రాజకీయాలకు చోటుండొద్దని ఆయన హితవు పలికారు. ఎన్నికల అప్పుడే రాజకీయాలు చేయాలని సూచించారు. ముధోల్ అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. త్వరలో ముధోల్‌లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు కానున్నట్లు ఆయన చెప్పారు.
తన చివరి రక్తపు బొట్టు వరకు ముధోల్ నియోజకర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ముధోల్‌లో త్వరలో మహిళా డిగ్రీ కళాశాల మంజూరు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. విద్యార్థులు చదువుల్లో బాగా రాణించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల కష్టాలను గుర్తు చేసుకుంటూ, విద్యార్థులు చదువుల్లో ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అమృత, బీజేపీ మండల అధ్యక్షుడు కోరి పోతన్న, మున్నూరు కాపు సంఘం తాలూకా అధ్యక్షుడు రోల్ల రమేశ్, నాయకులు నర్సాగౌడ్, తాటివార్ రమేశ్, శ్రీనివాస్, సప్పటోల్ల పోతన్న, దేవోజీ భూమేశ్, జీవన్, మోహన్, దత్తాద్రి, నిమ్మ పోతన్న, వెంకళ్ రావ్, తదితరులు పాల్గొన్నారు.