Scheduled Tribes Commission Chairman: నిర్మల్, అక్టోబర్ 3 (మన బలగం): ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేయాలని రాష్ట్ర షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలతో కలిసి అట్రాసిటీ కేసులు, వివిధ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ, జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా ఎస్సీ ఎస్టీలకు అందుతున్న అభివృద్ధి ఫలాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని సూచించారు.
ఇప్పటివరకు జిల్లాలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం మంజూరైన నిధులు, వినియోగించిన నిధులకు సంబంధించిన వివరాలను శాఖల వారీగా అధికారులు వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. నమోదైన కేసుల విషయంలో త్వరితగతిన దర్యాప్తును పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు పోలీసులు అండగా నిలవాలన్నారు. నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవన్ మరమ్మతులకు నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో పాఠశాల విద్యలో ఉత్తమ ఫలితాలు రాబట్టేలా కృషి చేసినందుకు గాను కలెక్టర్, విద్యాశాఖ అధికారుల ను ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ అభినందించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివిధ శాఖల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.సమావేశం అనంతరం కమిషన్ చైర్మన్, సభ్యులను జిల్లా కలెక్టర్, ఎస్పీలు సన్మానించారు. రాష్ట్రంలో పాఠశాల విద్యను ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషిచేసిన డిఈఓ రవీందర్ రెడ్డిని కమిషన్ చైర్మన్, సభ్యులు సన్మానించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లు, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ప్రవీణ్, రాంబాబు నాయక్, శంకర్, లక్ష్మీనారాయణ, నీలాదేవి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి రాజేశ్వర్ గౌడ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.