Mahashakti Temple
Mahashakti Temple

Mahashakti Temple: మహిమాన్వితం… మహాశక్తి ఆలయం

  • ఘనంగా ఆరంభమైన శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
  • తొలిరోజు బాలాత్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవార్లు
  • పోటెత్తిన భక్తజనం
  • భవానీ దీక్ష చేపట్టేందుకు క్యూ కట్టిన భక్తులు
  • దీక్ష చేపట్టిన మహిళలు, బాలికలు
  • ఉదయం నుంచి రాత్రి అమ్మవారి సేవలోనే బండి సంజయ్
  • దాండియా కార్యక్రమాలకు తరలివస్తున్న మహిళలు
  • వెలుగు జిలుగులతో అలరారుతున్న మహాశక్తి అమ్మవారి ఆలయం
  • నిత్యం వేలాది మంది దర్శించుకునేలా ఏర్పాట్లు

Mahashakti Temple: మనబలగం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ మహాశక్తి అమ్మవారి ఆలయంలో గురువారం నుంచి శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేఫథ్యంలో వేలాది మంది భక్తులు 9 రోజులపాటు ‘భవానీ దీక్ష’ చేపట్టేందుకు ఆలయానికి తరలివచ్చారు. భవానీ మాలాధారులై అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఊహించని రీతిలో మహిళలు, బాలికలు పెద్ద సంఖ్యలో భవానీ దీక్ష తీసుకోవడం విశేషం. భవానీ దీక్ష చేపట్టే భక్తులందరికీ దేవాలయంలో చేపట్టే అన్ని రకాల పూజలు, సేవలు ఉచితంగా అందుబాటులో ఉంచారు. భగవంతుడికి భక్తులందరూ సమానమేనని చాటి చెప్పేందుకు ఎలాంటి రుసుం లేకుండా, హుండీ లేకుండా ఉచితంగా అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు.

దేవాలయ ఆవరణలో అన్నదానం ఏర్పాటు చేశారు. దేవీ నవరాత్రి ఉత్సవాల తొలిరోజైన గురువారం నాడు కనీవినీ ఎరగని రీతిలో అమ్మవారి ఆలయానికి జనం పొటెత్తారు. ఒకవైపు జన సందోహం, మరోవైపు భవానీ దీక్షాపరులతో కరీంనగర్ మహాశక్తి ఆలయం పొటెత్తింది. తొలిరోజు బాలాత్రిపుర సుందరి అవతారంలో ముగ్గురు అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. మహిమాన్వితమైన మహాశక్తి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు రాష్ట్రం నలువైపుల నుండి తరలివస్తున్నారు. భక్తులతో మహాశక్తి ఆలయం జన సందోహంగా మారింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సైతం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా అమ్మవారి ఆలయంలోనే గడుపుతున్నారు.

వేలాదిగా తరలివస్తున్న భక్తులను కలుస్తూ వారి విజ్ఞాపనలను స్వీకరిస్తున్నారు. భవానీ భక్తులతో కలిసి బాలా త్రిపుర సుందరి అవతార రూపంలో దర్శనమిస్తున్న అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు కనువిందు చేసేలా దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూల అలంకరణలతో, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. గురువారం శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి (శైలపుత్రి)గా దర్శనమిచ్చిన అమ్మవార్లు శుక్రవారం శ్రీ గాయత్రీ దేవి (బ్రహ్మచారిని)గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అట్లాగే ఈ నెల 5న శ్రీ అన్నపూర్ణ (చంద్ర ఘంట) దేవిగా, 6న శ్రీ లలితా దేవి దేవి (కూష్మాండ )గా, 7న మహాచండీ దేవి (స్కంద మాత)గా, 8న శ్రీ మహాలక్ష్మి దేవి (కాత్యాయని)గా, 9న శ్రీ సరస్వతి దేవి (కాళరాత్రి)గా,10న దుర్గాష్టమి శ్రీ దుర్గాదేవి (మహాగౌరీ)గా, 11న శ్రీ మహిషాసురమర్ధిని దేవి (సిద్ధి రాత్రి)గా, విజయ దశమి పర్వదినమైన 12వ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.

మహాశక్తి అమ్మవార్ల ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజు సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు భక్తులకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ రాత్రి 9 గంటల నుంచి జరిగే దాండియా కార్యక్రమాలు హైలైట్‌గా నిలవనున్నాయి. మహిళలు, చిన్నారులు వేల సంఖ్యలో వచ్చి రాత్రిపొద్దుపోయే వరకు దాండియా ఆడుతూ ఆలయానికి వచ్చే భక్తులందరినీ అలరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *