- 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
- 258 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
- కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన
- టోకెన్ పద్ధతి ప్రకారం ధాన్యం తీసుకుని రావాలి
- ధాన్యం రవాణాకు వాహనాలను సన్నద్ధం చేయాలి
- సన్న రకాలను కేటాయించిన రైస్ మిల్లులకు తరలింపు
- ధాన్యం కొనుగోలుపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
Review of grain purchases: మన బలగం, కరీంనగర్ బ్యూరో: ఖరీఫ్ సీజన్ 2024 ధాన్యం కొనుగోలులో సన్న రకం క్వింటాల్ ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లిస్తుందని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024 ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిధిలో సన్న రకం, దొడ్డు రకాలు వేర్వేరుగా సేకరించేందుకు తీసుకుంటున్న చర్యలు, గన్ని సంచుల లభ్యత, వరి సాగు విస్తీర్ణం, రైతుల సంఖ్య, పంట దిగుబడి, వాటిని ఏ రైస్ మిల్లులకు పంపుతారు మొదలగు వివరాలను కొనుగోలు కేంద్రాల వారీగా కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనాతో, వీటి కొనుగోలుకు 258 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
సన్న రకం ధాన్యాలు జిల్లాలో 24 వేల 600 క్వింటాళ్ల వరకు కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అంచనాలు రూపొందించామని, ఏ గ్రామాల్లో సన్న రకం దాన్యం సాగు చేశారో, అక్కడి కొనుగోలు కేంద్రాలలో సన్న రకం ధాన్యం కొనుగోలు ప్రత్యేక కౌంటర్లు, కాంటాలు ఏర్పాటు చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక నెంబర్ కేటాయించాలని, సన్న రకం దాన్యం బ్యాగులపై ఆ నెంబర్ వేయాలని కలెక్టర్ తెలిపారు. గ్రేడ్ ఏ రకానికి రూ.2,320 , సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర చెల్లి్స్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ వేయింగ్ యంత్రాలు, తేమ యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్లు కొనుగోలు కేంద్రాలకు ఎన్ని అందిస్తున్నారు పూర్తి వివరాలు నివేదిక అందజేయాలని కలెక్టర్ పౌరసరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద సజావుగా కొనుగోళ్లు జరిగేలా కనీసం ఐదుగురు సిబ్బంది ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ధాన్యం కొనుగోలుకు మొత్తం 75 లక్షల గన్ని సంచులు అవసరం ఉన్నాయని, ప్రస్తుతం మన దగ్గర 25 లక్షల 5 వేల గన్ని సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. మిల్లర్ల వద్ద నుంచి మరో 18 లక్షల గన్ని సంచులను సేకరించాలని, మిగిలిన సంచులను త్వరగా సేకరించాలని కోరారు. ధాన్యం కొనుగోలు దగ్గరే ధాన్యం నాణ్యతను కట్టుదిట్టంగా పరిశీలించాలని, రైస్ మిల్లుల వద్ద ఎటువంటి కోతలు ఉండడానికి వీలులేదని ఝా తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం సన్న రకాల ధాన్యాలను ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జి వ్యవసాయ విస్తరణ అధికారితో సమన్వయం చేసుకుంటూ గుర్తించాలని, వీటిని కోనుగోలు చేసిన తర్వాత ప్రత్యేకంగా కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాగు నీరు, విద్యుత్ సరఫరా, లైట్లు మొదలగు సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించేందుకు వీలుగా అవసరమైన మేర వాహనాలు సన్నద్దం చేయాలని తెలిపారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు.
రోడ్ల మీద ధాన్యం ఆరబెట్టి, రోడ్డు ప్రమాదాలకు దారి తీయకుండా చూడాలన్నారు. రైతులకు టోకెన్ పద్ధతిలో మాత్రమే ధాన్యం సెంటర్‌కు తీసుకొని వచ్చి, కొనుగోలు చేసే విధంగా చూడాలని అన్నారు. ధాన్యం రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ , డీఆర్డీఏ పీడీ శేషాద్రి, అగ్రికల్చర్ ఆఫీసర్ అఫ్జల్ బేగం, సివిల్ సప్లై అధికారి వసంత లక్ష్మి, డి.ఎం. మార్కెటింగ్ ప్రకాశ్, డీఎం సివిల్ సప్లై రజిత, డీసీవో రామకృష్ణ, లీగల్ మెట్రాలజీ, డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, ప్యాక్స్ సెంటర్ ప్రతినిధులు, మిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు.
