Nirmal Collector: పోషణ అభియాన్‌కు సంబంధించిన పోషణ మాసం కార్యక్రమంలోని నిర్ధేశిత లక్ష్యాలు ప్రణాళికా బద్ధంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోషణ మాసం కార్యక్రమం పై అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 1 నుంచి 30 తేదీ వరకు పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా వారాల వారిగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో శిశువులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారం పై అవగాహన కల్పించాలని తెలిపారు. సంబంధిత అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అంగన్వాడీ చిన్నారులకు హెపటైటిస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలన్నారు. చిన్నారులు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి సరైన ఆహారం తీసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రి గార్డెన్లను ను ఏర్పాటు చేయాలన్నారు.
నిరంతరం ప్రతి అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి, అందిస్తున్న పోషకాహారం, సౌకర్యాలు, త్రాగునీరు, కోడిగుడ్లు, బియ్యం, తదితర వస్తువుల నాణ్యతను పరీక్షించి నివేదికలు రూపొందించాలన్నారు. తల్లిపాలు శిశు శారీరక మానసిక ఎదుగుదలకు ఎంతగానో మేలు చేస్తుందని, తల్లిపాల ఆవశ్యకతపై విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. వైద్యారోగ్య శాఖ సహకారంతో రక్తహీనత నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, రక్త హీనత పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అవసరమైన వారికి మందులను అందించాలని ఆదేశించారు. పోషణ మాసం కార్యక్రమంలో మహిళా స్వయం సంఘాలను, తల్లిదండ్రులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. అనంతరం పోషణ మాసం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించి, అధికారులచే ప్రతిజ్ఞ నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఆర్డిఓ విజయలక్ష్మి, డిఎంహెచ్వో రాజేందర్, మిషన్ భగీరథ ఈఈ సందీప్, మెప్మా పీడీ సుభాష్, సిడిపివోలు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.