Nagoba Jatara: నిర్మల్/మన బలగం: తెలంగాణలో రెండో అతిపెద్ద గిరిజన జాతర షురూ అయ్యింది. ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్‌లోని నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాజాతరకు అంకురార్పణ చేశారు. వారం రోజులపాట జరిగే గిరిజన జాతరకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. రాష్ర్టం నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు వేల సంఖ్యలు తరలివస్తారు. ఆదిమ గిరిజనుల్లో గోండు తెగకు చెందిన మెస్రం వంశీయులు నాగదేవత అయిన నాగోబాకు పూజలు నిర్వహించడం జాతర విశిష్టత. కొన్ని శతాబ్దాలుగా నాగోబా జాతర నిర్వహిస్తున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతర తరువాత అంత్యంత వైభవంగా పెద్ద ఎత్తున జరిగే జాతర ఇదే. ఆదిలాబాద్ జిల్లాలోని కెస్లాపూర్ జాతర విశేషాలు ఇవే.
ప్రతి సంవత్సరం పుష్యమాసం ఆమావాస్య రోజున ఈ జాతర ప్రారంభమవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరజల్లుతుందని, రోగాలు మటు మాయమవుతాయని ఆదివాసి గిరిజనుల నమ్మకం. నాగోబా చరిత్ర గురించి గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. గోండుజాతికి మూల పురుషుడు మెస్రం వంశస్థుడైన ‘పడియార్’ ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్‌లో జన్నించాడని, గోండుల మూల దైవం ఇక్కడే వెలసిందని గిరిజన సంస్కృతికి చెందిన చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. గిరిజన సంస్కృతి ఆరంభమైన నాటి నుంచి కెస్లాపూర్‌లోని గిరిజన ఆరాధ్య దైవం నాగోబాను పూజిస్తున్నారు.
పుష్యమాసం ఆరంభంలో ఆకాశంలో నెలవంక కనిపించిన రెండో రోజు నాగోబా దేవాలయంలో గోండులంతా హాజరై నాగోబా జాతరలో జరగాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారు. అనంతరం చైత్ర మాసం పౌర్ణమి అయిన మరుసటి రోజు సిరికొండ అనే గ్రామంలో కొత్త కుండలు తయారు చేయిస్తారు. అనంతరం పవిత్ర గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు కాలినడకన జన్నారం మండలం కలమడుగు గ్రామం హస్తిన మడుగు వద్ద గల గోదావరి నదికి చెరుకుంటారు. ఇలా 70 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన వారం రోజుల పాటు ప్రయాణం చేసి ఝారి అనే కలశంలో పవిత్ర నీటిని తీసుకొని వచ్చి ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రి చెట్ల కిందికి చేరుకొని తమ వంశ పూర్వీకులకు తూమ్ అనే పూజలు నిర్వహిస్తారు. మూడో రోజు గోదావరి నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో ఆలయాన్ని కడిగి నాగోబా దేవతకు అభిషేకం చేసి నవధాన్యలతో పాటు ఆవు పాలు నైవేద్యంగా సమర్పించి మహా పూజ నిర్వహిస్తారు.
మెస్రం వంశానికి చెందిన నవ వధువుల బేటీ ఉంటుంది. దైవ సన్నిధిలో నవ వధువుల పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం ఘనంగా జాతర ప్రరంభమవుతుంది. ఇలా వారం రోజుల పాటు నాగోబా జాతర కొనసాగుతోంది. ఈ జాతరకు మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుంచి గిరిజనులు వస్తారు. ఈ జాతరకు గిరిజనులు ఎడ్లబండ్లు, కాలినడకన ఇంటిల్లిపాదితో తరలి రావడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితే గిరిజనులే కాకుండా గిరిజనేతరులు సైతం నాగోబాను ఇష్టదైవంగా కొలువడం విశేషం.
మంగళవారం రాత్రి నిర్వహించిన నాగోబా మహా పూజలో ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ సంప్రదాయ బద్ధంగా నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగోబా మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని రకాల ఏర్పాట్లను చేశామని తెలిపారు. ఈ నెల 31న జరిగే దర్బార్‌కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కలతో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. నాగోబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని ప్రార్థించారు. పాడి పంటలు బాగా పండాలని, ప్రపంచమంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ అలం, ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తా, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఏఎస్పీ కాజల్, అధికారులు, మెస్రం వంశీయులు తదితరులు పాల్గొన్నారు.