Whip Laxman: ధర్మపురి, నవంబర్ 7 (మన బలగం): జగిత్యాల జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో వెల్గటూర్ మండలం కోటిలింగాలలో ఏర్పాటు చేసిన వందశాతం రాయితీపై చేప పిల్లల విడుదల కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్య శాఖ అధికారులు, మండల నాయకులతో కలిసి గోదావరిలో చేప పిల్లలను వదిలారు. అనంతరం ప్రభుత్వ విప్ లక్షణ్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో వంద శాతం రాయితీ పైన ఉచిత చేప పిల్లలను గోదావరిలో వదిలే కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, గంగపుత్రులు గాని, ముదిరాజులకు గాని మేలు జరిగే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మత్స్య రంగానికి సంబంధించి చేప పిల్లల పెంపకానికి కొంత భూమి అవసరం ఉందన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. మత్స్య రంగంపై ఆధారపడి ఉన్నవారికి ఇటు కేంద్ర ప్రభుత్వం తరఫున గాని, అటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గాని ఎటువంటి పథకాలు అందుబాటులో ఉన్నా వారికి లబ్ధి చేకూరే విధంగా తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. జిల్లా మత్స్య శాఖ అభివృద్ధికి సంబంధించి ఎటువంటి అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు