మంత్రి సీతక్కను కలిసిన నారాయణరావు పటేల్ వర్గీయులు
Mudhole Congress: నిర్మల్, అక్టోబర్ 26 (మన బలగం): భైంసా మార్కెట్ కమిటీ డైరెక్టర్ల నియామకంలో తమక అన్యాయం జరిగిందని నారాయణరావు పటేల్ వర్గీయులు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కను కలిసి ఫిర్యాదు చేశారు. ముందు నుంచి పార్టీని నమ్ముకున్న వారిని కాదని వలస వచ్చిన వారికి పెద్ద పీట వేశారని అసహనం వ్యక్తం చేశారు. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతూ, చిత్తశుద్ధితో అంకితభావంతో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నారాయణరావు పటేల్ రాసిన లేఖను, పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రికి అందజేశారు. భైంసా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, కొందరు డైరెక్టర్లు ఎన్నికల్లో ఇతర పార్టీలకు పనిచేశారని, వారికి ఎట్లా పదవులు ఇస్తారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బాసర ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు, కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పదవులు, ఆత్మ చైర్మన్‌తో పాటు ఇతర పదవులు కష్టపడ్డ కార్యకర్తలకు ఇవ్వాలని వారు విన్నవించారు. ఇటీవల పార్టీలో చేరిన వారిపై సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మంత్రి సీతక్కను కలిసిన వారిలో మాజీ ఎంపీపీ రామచంద్రారెడ్డి, బాసర మాజీ సర్పంచ్ ముమ్మాయి రమేశ్, ప్రేమ్‌నాథ్ రెడ్డి, బెజ్జంకి ముత్యం రెడ్డి, కుబీర్ మండల కాంగ్రెస్ నాయకులు రమేశ్‌తో పాటు పలువురు ఉన్నారు.