అక్షరాభ్యాసం కోసం బారులు
Basra: ముధోల్, పిబ్రవరి 2 (మన బలగం): బాసర సరస్వతి పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. క్యూలైన్‌లలో ఉన్న భక్తులకు పాలు, మంచినీటి అందించారు. చిన్నారులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. అమ్మవారి దర్శనం కోసం గంటలతరబడి బారులు తీరారు. సరస్వతి నమోనమః నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారుల దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులు పరిస్థిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. పారిశుధ్య లోపం ఏర్పడకుండా సుమారు 150 మంది పారిశుధ్య కార్మికులను నియమించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక అడిషనల్ ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీ లు, 10 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్‌లు, 22 మంది ఎస్సైలతో పాటు సుమారు 200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం అమ్మవారి జన్మదినం వసంత పంచమి సందర్భంగా భక్తుల రద్దీ పెరగనుంది. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.