Nirmal District Collector Abhilash Abhinav: నిర్మల్, జనవరి 28 (మన బలగం): కడెం మండలం కొత్త మద్దిపడగ గ్రామంలో పునరావాసితులైన మైసంపేట్, రాంపూర్ గ్రామాల ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పునరావాస గ్రామాల ప్రజలకు కల్పిస్తున్న వసతులపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పునరావాసం పొందిన ప్రజలకు కేటాయించిన వ్యవసాయ భూములను సాగుకు యోగ్యంగా మార్చాలని ఆదేశించారు. పనులకు సంబంధించిన సమాచారాన్ని శాఖల వారీగా సమీక్షించారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ వంటి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. గ్రామస్తులకు కల్పిస్తున్న అన్ని మౌలిక వసతులను అత్యంత నాణ్యవంతంగా చేపట్టాలన్నారు. గ్రామస్తుల పంట భూములకు సంబంధించి రెవెన్యూ పట్టాల కోసం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మిగిలిన పనులన్ని వెంటనే పూర్తిచేయాలని అన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారి నాగిని భాను, ఆర్డీవో రత్నకళ్యాణి, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.