- ప్రాధాన్యం తగ్గడంపై అసహనం
- కేడర్‌కు గర్తింపు ఇవ్వడంలేదని ఆగ్రహం
- ముధోల్ కాంగ్రెస్‌లో కలవరం
- కొత్తగా చేరిన వారికి పదవులు
- ముందు నుంచి పనిచేసిన వారికి మొండిచేయి
- విఠల్ రెడ్డి చేరికపై గుర్రు
- పొడసూపుతున్న విభేదాలు
- వర్గ పోరుతో అధిష్టానానికి తలనొప్పి
Narayan Rao Patil: నిర్మల్, అక్టోబర్ 26 (మన బలగం): దశాబ్ద కాలంపాటు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీని అంటి పెట్టుకొని ఉండి అధికారంలోకి తీసుకురావడంలో కృషి చేసిన నేతలకు ప్రాధాన్యం తగ్గుతోంది. కనీసం పార్టీ అభ్యర్థిగా నిలిచేందుకు ముందుకు రాని సమయంలో హస్తం కోసం అహర్నిషలు కృషి చేసారు. అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ జెండాను భుజాన మొసిన నాయకులు, కార్యకర్తల్లో ప్రస్తుతం అసహనం పెల్లుబుగుతోంది. అధికార పార్టీ నేతల ఒత్తిడిని తట్టుకొని కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న తమను విస్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ర్ట వ్యప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నా నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకర్గంలో నేతలు గుర్రుగా ఉన్నారు. తమకు ప్రాధాన్యత తగ్గుతోందని వాపోతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కనీసం పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావ్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక్కడ కాంగ్రెస్‌కు ఎన్నికల సమయంలో గడ్డు పరిస్థితులు. అయినా ఉన్న క్యాడర్‌తో ప్రజా క్షేత్రంలో పోటీ చేసి నారాయణ్ రావ్ పటేల్ పార్టీ పరువు కాపాడారు. పార్టీ అధికారంలోకి రావడంతో నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం జరుగుతుందనకుంటే ప్రస్తుత పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. తమకు అన్యాయం జరుగుతోందని కార్యకర్తలు వాపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అధికార పార్టీలో చేరడంతో వర్గ విభేదాలు ప్రారంభం అయ్యాయి. భైంసా మార్కెట్ చైర్మన్‌గా ఆనంద్ రావ్ పటేల్‌ను నియమించడం సముచితమే అయినప్పటికీ వైస్ చైర్మన్, డైరెక్టర్ల నియామకంలో అన్యాయం జరిగిందని కార్యకర్తలు అంటున్నారు. పార్టీ కోసం అహో రాత్రులు శ్రమిస్తే వలస వచ్చిన వారికి పదవులు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో వారే డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ వచ్చాక వారే మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కావడంతో అధిష్టానంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌పై అభిమానంతో పని చేసిన కార్యకర్తలకు పదవులు ఇవ్వకుండా వారి అవసరం కోసం అధికార పార్టీలో చేరిన వారికి పదవులు ఇవ్వడంతో ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావ్ పటేల్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ పెద్దలను సైతం మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావ్ పటేల్ కలుస్తారని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. భైంసా మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమించినప్పటికీ, కుబీర్ మార్కెట్ కమిటీ నియామకం ఎందుకు చేపట్టలేదని భైంసాలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టి అధిష్టానాన్ని ప్రశ్నించారంటే కాంగ్రెస్‌లో వర్గ విభేదాలకు అద్దంపడుతోంది. దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడుతూ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాలకవర్గాన్ని తన హయాంలో ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. తక్షణమే కుభీర్ మార్కెర్ కమిటీ పాలకవర్గాన్ని నియమించాలని డిమాండ్ చేశారు.