Family Survey: నిర్మల్, నవంబర్ 12 (మన బలగం): జిల్లా వ్యాప్తంగా ప్రతి నివాస ప్రాంతంలోని ప్రతి ఇంటిలో సమగ్ర సర్వేను పక్కాగా నిర్వహించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని ఏఎన్ రెడ్డి కాలోని, రాంనగర్‌లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం నిర్వహిస్తున్న సమగ్ర సర్వే తీరును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే కోసం హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ సందర్భంగా ఇళ్లకు అతికించిన స్టిక్కర్లపై నమోదు చేసిన వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సర్వే ఫారంలోని ప్రశ్నావళి ప్రకారం నిర్ణీత నమూనాలో సమాచారాన్ని సేకరిస్తున్నారా లేదా అన్నది తనిఖీ చేశారు. ప్రతి కుటుంబంలోని ఒక్కో వ్యక్తి వారీగా పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఎన్యూమరేటర్‌కు సూచించారు. ఇప్పటివరకు ఎన్ని ఇళ్లలో సర్వే పూర్తయ్యింది, కుటుంబ వివరాల సేకరణ సందర్భంగా ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? కొత్తగా గమనించిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీశారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ, ఏ చిన్న తప్పిదానికి సైతం తావు లేకుండా నిర్ణీత కోడ్‌లను పొందుపరుస్తూ స్పష్టమైన సమాచారంతో దరఖాస్తు ఫారాలను పూరించాలని సూచించారు. ప్రతీ ఎన్యూమరేటర్ రోజుకు సగటున కనీసం 15 ఇళ్లను సందర్శిస్తూ సర్వే ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్యూమరేటర్లకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ, సర్వే ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ చేయాలని సూపర్వైజర్లను ఆదేశించారు. ప్రతీ ఎన్యుమరేటరు సమయానికి నిర్దేశించిన ఎన్యూమరేషన్ బ్లాకుల్లో సర్వేను చేపట్టాలన్నారు. సర్వే నిర్వహించే కుటుంబాల సభ్యులు ఎవరైనా అందుబాటులో లేనట్లయితే వారి గుర్తింపు పత్రాల ఆధారంగా వారి వివరాలు నమోదు చేయాలన్నారు. ఇప్పటి వరకు పూర్తయిన సర్వే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, మెప్మా పిడి సుభాష్, తహసీల్దార్ రాజు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.