Grain purchases: నిర్మల్, నవంబర్ 12 (మన బలగం): ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. లక్ష్మణచాంద మండలం పీచర గ్రామ కొనుగోలు కేంద్రంలో మంగళవారం సహకార శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి ఆయన సందర్శించారు. కేంద్రంలో రైతులు తరలించిన ధాన్యం నిల్వలను, వాటి నాణ్యతను, మాయిశ్చర్ మీటర్ ద్వారా ధాన్యం తేమ శాతాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రైతులు ధాన్యం తీసుకువచ్చేలా విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సన్నరకం ధాన్యం ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో కొనుగోలు చేశారు. ఇంకా ఎంత పరిమాణంలో ధాన్యం కేంద్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. గన్ని బ్యాగ్స్, టార్పాలిన్ అందుబాటులో ఉంచాలని సూచించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటదివెంట ధాన్యం కొనుగోళ్లు జరపాలని, సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీలు త్వరగా చేయాలని సూచించారు. అన్ని రకాల రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లా కలెక్టర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ, ప్రతి ఎన్యూమరేటర్ సర్వే వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. ఎన్యూమరేటర్లు తమ పరిధిలోని ఏ ఒక్క ఇంటిని విడిచి పెట్టకుండా సర్వే నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు గ్రామంలో సర్వే పూర్తిచేసిన కుటుంబ వివరాలు, సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లు, గ్రామ జనాభా, గ్రామంలోని బ్లాకులు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో బాధ్యతగా పాల్గొనాలని తెలిపారు. సర్వే లక్ష్యాలను ప్రజలకు వివరించాలన్నారు. అధికారులు అడిగిన అన్ని వివరాలు తెలియజేసి సర్వే విజయవంతానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమాలలో ఆర్డీవో రత్న కళ్యాణి, డీఎం సివిల్ సప్లయిస్ వేణుగోపాల్, డీఎస్ఓ కిరణ్ కుమార్, డీసీవో రాజమల్లు, జిల్లా వ్యవసాయాధికారి అంజి ప్రసాద్, ఎంపీడీఓ రాధ, రైతులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.