- ప్రతి గ్రామంలో పథకాల అమలు
- సీఎం సందేశం ప్రదర్శించాలి
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి
Chief Secretary Shanti Kumari: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, జనవరి 26 (మన బలగం): జనవరి 26 గణతంత్ర దినోత్సవ నుంచి 4 నూతన పథకాల అమలు ప్రారంభం చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శనివారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల మాట్లాడుతూ, గ్రామ, వార్డు సభలను సమర్థవంతంగా నిర్వహించినందుకు అధికారులకు ముందుగా అభినందనలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల, నూతన రేషన్ కార్డుల జారీ పథకాలను లాంఛనంగా ప్రతి మండలంలో ఒక గ్రామంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ప్రతి మండలంలో 250 నుంచి 400 వరకు ఇండ్లు ఉన్న గ్రామాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఈ గ్రామాలను ఎంపిక చేయాలని అన్నారు. ప్రజాపాలన ప్రారంభించే గ్రామాల జాబితా, గ్రామాలలో 4 పథకాల లబ్ధిదారుల వివరాలను నిర్ణీత నమూనాలలో పంపాలని కలెక్టర్లకు సిఎస్ తెలిపారు. జనవరి 26న ఎంపిక చేసిన గ్రామాలలో మధ్యాహ్నం ఒంటి గంటకు 4 పథకాలను అధికారికంగా ప్రారంభించాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగాలని, 4 పథకాలకు సంబంధించి సదురు గ్రామాల్లో అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని అన్నారు. 4 నూతన పథకాల లాంచింగ్‌లో అర్హులు మాత్రమే జాబితాలో ఉండేలా అప్రమత్తంగా ఉండాలని, గ్రామ సభలలో స్వీకరించిన నూతన దరఖాస్తులను సైతం పరిశీలించి అర్హులు ఉంటే రేపటి జాబితాలో యాడ్ చేయాలని అన్నారు.
నూతన రేషన్ కార్డుల జారీని తహసిల్దార్ బృందం, ఇందిరమ్మ ఇండ్ల జాబితాను ఎంపీడీవో బృందం, రైతు భరోసా జాబితాను మండల వ్యవసాయ అధికారి బృందం, ఇందిరమ్మ రైతు భరోసా జాబితాను ఏపీవో & నరేగా బృందం పరిశీలించి, ఆ జాబితాలో అర్హులు మాత్రమే ఉండేలా పథకాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలని, 4 పథకాలకు సంబంధించి లబ్దిదారులు ప్రారంభ కార్యక్రమానికి వచ్చేలా చూడాలని, లబ్ధిదారుల వివరాలను గ్రామాలలో ప్రదర్శించాలని తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి ప్రతి గ్రామంలో మంచి ఆడియో వీడియో ఏర్పాట్లు చేయాలని, ముందస్తుగా ముఖ్యమంత్రి గారి సందేశాన్ని ప్రతి గ్రామంలో ప్రదర్శించాలని సీఏస్ అన్నారు. 4 పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రజలకు మరో సారి వివరించాలని, ఎంపిక కాబడిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జారీ చేయాలని, అనంతరం ప్రజా ప్రతినిధులు తమ సందేశాలు అందించాలని, లాంచ్ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అడ్వైజర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ లను ఆహ్వానించాలని సీఎస్ పేర్కొన్నారు. 4 పథకాల లాంచింగ్ కోసం ఎంపిక చేసిన గ్రామాలలో నిర్వహించిన గ్రామసభలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపి, నేడు క్షేత్రస్థాయి విచారణ చేయాలని, ఆ దరఖాస్తులలో అర్హులు ఉంటే పేర్లు నమోదు చేసి రేపటి లాంచింగ్ కార్యక్రమంలో పథకాలను సంబంధిత లబ్ధిదారులకు వర్తింపజేయాలని అన్నారు.
ప్రతి మండలంలో 4 పథకాల లాంచింగ్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, ఎక్కడ ఎటువంటి గందరగోళం జరిగేందుకు వీలు లేదని, ప్రభుత్వ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారుడు వరకు చేరుతాయనే విశ్వాసాన్ని ప్రజలలో కల్పించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామసభలు, 67 వార్డు సభ్యులు విజయవంతంగా నిర్వహించామని అన్నారు. నూతనంగా 16 వేల 505 రేషన్ కార్డు దరఖాస్తులు 14 వేల 542 ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు, 141 రైతు భరోసా దరఖాస్తులు, 9 వేల 172 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దరఖాస్తులు మొత్తం 40,360 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 4 నూతన పథకాల లాంచింగ్‌కు ప్రభుత్వ ఆదేశాల మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
