Nirmal Collector: పోషణ్ అభియాన్ కార్యక్రమంలో తల్లి, బిడ్డలకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం పట్టణంలోని టీఎన్జీవోస్ హాల్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పోషణ్ అభియాన్ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి ఆమె పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణులు, బాలింతలకు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఈ నెల ఒకటి నుంచి 30 వరకు నిర్వహిస్తున్న జాతీయ పోషణ మాసంలో సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి పోషణ, పోషకాహారం, శుద్ధమైన తాగునీరు, పరిశుభ్రతపై వివరించాలన్నారు.
జిల్లాలోని 926 అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ అభియాన్ కార్యక్రమం పక్కాగా అమలు చేయాలని, తల్లి, బిడ్డల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రతిరోజూ గర్భిణులకు, బాలింతలు, పిల్లలకు పాలు, గుడ్లు, పోషక విలువలు కలిగిన హారాన్ని అందించాలన్నారు. అంగన్‌వాడీ, ఆశ, వైద్య సిబ్బంది సమన్వయంతో గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, పోషణ, ఆరోగ్య శుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. పోషణ లోపం కలిగిన పిల్లలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి చిన్నారి వయసుకు తగిన బరువు, ఎత్తు ఉండేలా పోషక ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ, జాతీయ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు, అంగన్‌వాడీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.
తల్లి, బిడ్డల సంపూర్ణ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మహిళా, శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ తల్లి బిడ్డల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం గర్భిణులు, బాలింతలు, అంగన్‌వాడీ, వైద్య శాఖ సిబ్బందిచే కలెక్టర్ పోషణ అభియాన్ కార్యక్రమం అమలుపై ప్రతిజ్ఞ చేయించారు. అలాగే గర్భిణులకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు వివిధ అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది ప్రదర్శించిన పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను కలెక్టర్, అదనపు కలెక్టర్లు పరిశీలించారు. కార్యక్రమంలో సీడీపీవో నాగలక్ష్మి, వైద్యులు నయన రెడ్డి, సౌమ్య, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, అధికారులు, కౌన్సిలర్లు, అంగన్‌వాడీసిబ్బంది, గర్భిణులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.