- ఇంద్రానగర్ కేంద్రంగా వ్యభిచారం
- పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు, విటుడు
- మద్యం బాటిళ్లు, సెల్ఫోన్లు, కండోమ్స్ స్వాధీనం
- వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ
Nirmal sex racket busted: నిర్మల్ జిల్లా కేంద్రంగా కొన్ని నెలలుగా కొనసాగుతున్న సెక్స్ రాకెట్‌ను పోలీస్ యంత్రాంగం ఛేదించింది. నిర్మల్ పట్టణంలో పెద్దలు నివాసముండే ఇంద్రానగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా ఓ మహిళ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది.
సోఫీనగర్ నుంచి ఇంద్రానగర్‌కు షిఫ్ట్
నిర్మల్ పట్టణ నడిబొడ్డున గల ఇంద్రానగర్ కేంద్రంగా సెక్స్ వ్యవహారం నడుపుతున్నారు. పెద్దలు నివాసముండే ప్రాంతం కావడం వల్ల ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందని ఈ కాలనీని ఎంపిక చేసుకుని వ్యభిచారం చేస్తున్నారు. శాంతినగర్ కాలనీకి చెందిన నఫీసా బేగం ఇంద్రానగర్‌లో వ్యభిచార గృహాన్ని నడిపిస్తోంది. గతంలో ఈమె సోఫీనగర్‌లో తన సొంత ఇంట్లో వ్యభిచార గృహాన్ని నడపడం వల్ల కాలనీవాసులు వ్యతిరేకించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ తన వ్యవహారం నడవదని భావించిన నఫీసా బేగం తన వ్యాపారాన్ని ఇంద్రానగర్‌కు మార్చుకుంది.
పక్కా సమాచారంతో దాడి
పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో వ్యభిచార గృహం నడుస్తుందన్న పక్క సమాచారంతో ఏఎస్పీ రాజేష్ మీనా, పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ ల ఆధ్వర్యంలో రెక్కీ నిర్వహించి దాడి చేశారు.గత కొన్ని నెలలుగా నిర్మల్ పట్టణ పరిధిలోని ఇందిరా నగర్ ప్రాంతంలో ఒక ఇంటిని కేంద్రంగా చేసుకొని కొందరు మహిళలు కలిసి వ్యభిచార గృహాన్ని నడుపుతున్నారని నమ్మదగిన సమాచారం రావడంతో, జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించారు.ఈ దాడిలో భాగంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిని చుట్టుముట్టి, లోపలికి వెళ్లి తనికి చేయగా వ్యభిచార గృహాన్ని నడిపిస్తున్న మహిళలను, ఒక బాధితురాలిని,అలాగే ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు.
పేద మహిళలే లక్ష్యంగా
పేద మహిళలను లక్ష్యం చేసుకుని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. వారి ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకున్న నఫీసా బేగం వారిని చేరదీసి ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు వీరి ఉచ్చులో పడ్డట్లు తెలుస్తోంది. నిర్మల్ జిల్లాతోపాటు పక్కనే ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన విటులు వీరి వద్దకు వస్తున్నట్లు సమాచారం.
మద్యం బాటిళ్లు, సెల్ ఫోన్లు స్వాధీనం
పట్టణంలోని ఇంద్రానగర్లో కొనసాగుతున్న వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడిలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సెల్‌ఫోన్లు, మద్యం బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రతినిత్యం మద్యం మత్తులో వీరి వ్యవహారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
పోలీసులకు చిక్కిన మరింత సమాచారం
పట్టణంలోని ఇంద్రానగర్లో కొనసాగుతున్న వ్యభిచార గృహంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో పోలీసుల చేతికి రహస్య సమాచారం చిక్కినట్లు తెలుస్తోంది. వ్యభిచార గృహ నిర్వాహకురాలి సెల్ ఫోన్‌తో పాటు మరో మహిళ, విటుని సెల్ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకురాలి సెల్‌ఫోన్ ఆధారంగా ఎవరెవరు ఈ వ్యభిచార గృహానికి వచ్చారు అనే సమాచారం పోలీసుల చేతికి చిక్కింది. దీని ఆధారంగా మరింత మందిని పోలీసులు అరెస్టు చేసే అవకాశముంది.
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే శిక్షలు తప్పవు: ఎస్పీ జానకి షర్మిల
ఎంతటి వారైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే శిక్షలు తప్పవని జిల్లా ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. శాంతినగర్ కాలనీకి చెందిన నఫీసా బేగం ఈజీ మనీకి అలవాటు పడ్డ మహిళలను చేరదీసి ఈ అక్రమ వ్యవహారాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. వీరి ఉచ్చులో అనేకమంది పేద మహిళలు పడ్డట్లు తమ వద్ద సమాచారం ఉందని వివరించారు.
ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల గౌరవం, రక్షణ, యువత భవిష్యత్తు పరిరక్షణ, సమాజ నైతిక విలువల పరిరక్షణ కోసం పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పి సూచించారు. ఈ సందర్భంగా వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసిన ఎస్పీ రాజేష్ మీన, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్‌లను ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఎస్సై, నీఆర్వో రవి నాయుడు పాల్గొన్నారు.
