Upadi Hami Labours: కరీంనగర్, మార్చి 20 (మన బలగం): ఉపాధిహామీ కూలీలు పని చేస్తున్న పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించి కూలీలకు రక్షణ కల్పించాలని బీకేఎంయూ రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ కోరారు. గురువారం బీకేఎంయూ ఆధ్వర్యంలో ఉపాధిహామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ డీఆర్డీవో శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో పని చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు లేక తీవ్ర ఎండ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పని ప్రదేశాల్లో మంచినీటి సౌకర్యం, నీడ సౌకర్యం ఏర్పాటు చేయాలని, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని, దూర ప్రదేశాలకు వెళ్లే కూలీలకు రవాణా సౌకర్యం కల్పించాలని అన్నారు. గ్రామసభలో గుర్తించిన పని ప్రదేశాలు కూలీలకు అనువుగా లేక పోవడం వల్ల మేటి పెట్టిన కొలతలకు అనుగుణగా పని చేయలేక పోతున్నారని, గడ్డ పారలతో తవ్వినా మట్టి రావడం లేదని, దీనివల్ల రోజుకు 100 రూపాయలు కూలి పడడం లేదని తెలిపారు. కూలీలకు గడ్డపార, పార పదును చేయించడానికి డబ్బులు చెల్లించాలని, అధికారుల పర్యవేక్షణ ఎల్లవేళలా ఉండాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రెట్లను రూ.600 పెంచాలని, 200 రోజులు కూలీలకు పని కల్పించాలని సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బోయిని అశోక్ జిల్లా ఉపాధ్యక్షులు ఎగుర్ల మల్లేశం నాయకులు నల్లగొండ శ్రీనివాస్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.