AISF: కరీంనగర్, మార్చి 20 (మన బలగం): బడ్జెట్‌లో విద్యారంగాన్ని విస్మరించడాన్ని నిరసిస్తూ వెంటనే బడ్జెట్ సవరించి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తా వద్ద ప్లకార్డ్‌లతో నిరసన తెలిపారు. ఈ సంధర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామరాపు వెంకటేశ్, జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్ మాట్లాడుతూ.. గత బడ్జెటికు ఈ బడ్జెట్ కేవలం 0.2 శాతం నిధులు కేవలం రూ.1,816 కోట్లు మాత్రమే పెంచారని, ఈ నిధులు విద్యారంగ అభివృద్ధికి ఏ మేరకు సరిపోవని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, కానీ రెండో బడ్జెట్ కేటాయింపులోనూ ఆ హామీ మేరకు నిధులు కేటాయించ కపోవడం సరికాదన్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఉన్నత విద్యా బలోపేతం, ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధి ఊసేలేదన్నారు. మంత్రి లేని విద్యాశాఖ పాలనలో లోపం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రి నియమించకపోవడం పట్ల ఏఐఎస్‌ఎఫ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. మంత్రి లేకపోవడం వల్ల విద్యారంగంలో నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయి. ఇది పాలనాపరమైన వైఫల్యాన్ని సూచిస్తోంది అని అన్నారు. వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించి, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. బడ్జెట్‌ను సవరించి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేశ్, జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్, జిల్లా నాయకులు మచ్చ అభిలాష్, దాసరి అఖిల్, అక్షయ్ కుమార్, శివ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.