నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్
Nirmal Collector: కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కేజీబీవీ ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, విద్యాశాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేజీబీవీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు సమకూర్చాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలల ప్రాంగణాలలో వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని, దోమలు వృద్ధి చెందకుండా నిరంతరం ఫాగింగ్, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి విద్యార్థికి వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలన్నారు.
విద్యార్థుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద వహించాలని, వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందించాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, ఫ్యాన్స్ వంటి పనులు, మరమ్మత్తులు పూర్తి చేయాలని అన్నారు. విద్యార్థులు క్రీడలలో రాణించేలా ప్రతి కేజీబీవీ లలో క్రీడా పరికరాలను సమకూర్చుకోవాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులను నిర్వహించి, నైపుణ్యాలను నేర్పించాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.