Whip Adluri Laxman Kumar: వెల్కటూర్, జనవరి 6 (మన బలగం): తెలంగాణ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం కోటిలింగాలలోని కోటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాదాయ, ఇరిగేషన్, రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి, ఇతర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి విషయంలో అధికారులు ఎక్కడ నిర్లక్ష్యం వహించరాదని, ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు ఏమి ఉన్నా వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, తాగునీటి సదుపాయం మరియు మరుగుదొడ్ల నిర్మాణం, వంటివి పూర్తి చేయాలని, వచ్చే భక్తులకు బట్టలు మార్చుకోవడానికి శాశ్వత షెడ్ నిర్మాణం చేయాలని తెలిపారు. మండలానికి సంబంధించిన సాగు నీటికి విషయంలోనూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఒక ప్రాంతంలో ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే ఆ ప్రాంత అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను వినియోగించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ పాలకులు వాటిని పట్టించుకోలేదని, గత ప్రభుత్వంలో దాదాపు 20 వేల కోట్ల రూపాయలతో కాళేశ్వరం లింక్ 2 నిర్మాణం ద్వారా ఇక్కడి నీటిని సిద్దిపేటకు తరలించారని చెప్పారు. ఈ ప్రాంతానికి సంబంధించి ప్రతి రూపాయిని ఇక్కడి అభివృద్ధికే వినియోగించాలని మెగా కంపెనీ యాజమాన్యానికి స్పష్టం చేసారు. ఈ ప్రాంత పారిశుధ్యం విషయంలోనూ 2 లక్షల 99 వేల రూపాయల నిధులు మంజూరయ్యాయని, మరో 3 లక్షల రూపాయల అవసరం ఉందని అధికారులు తెలిపారు. దానికి ఏసీడీపీ నిధుల నుంచి 3 లక్షల రూపాయలను మంజూరు చేస్తామని విప్ చెప్పారు.
